Apple: భారత్‌లో యాపిల్ కొత్తగా మరో నాలుగు రిటైల్ స్టోర్లు
ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటనలో యాపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెయిర్‌డ్రె ఓ'బ్రియన్ వెల్లడించారు.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రీమియం బ్రాండ్ యాపిల్ భారత మార్కెట్లో మరింత విస్తరించాలని భావిస్తోంది. ఇప్పటికే దేశీయంగా ఢిల్లీ, ముంబైలలో రెండు స్టోర్లను నిర్వహిస్తోంది. కొత్తగా బెంగళూరు, పూణెలతో పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైలలో కలిపి నాలుగు స్టోర్లను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని యాపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెయిర్‌డ్రె ఓ'బ్రియన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశీయంగా వినియోగదారుల నుంచి ఐఫోన్‌లకు, యాపిల్ ఉత్పత్తులకు ఆదరణ పెరిగింది. కస్టమర్ల కోసం మరిన్ని ఉత్పత్తులను, సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇదే సమయంలో ఇటీవల యాపిల్ సంస్థ తన కొత్త ఐఫోన్ 16 సిరీస్ ఫోన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటి తయారీ కూడా భారత్‌లోనే చేపడుతోంది. దీనికి సంబంధించి ఓ'బ్రియన్ మాట్లాడుతూ.. భారత్‌లో తయారైన ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లను త్వరలో స్థానిక విక్రయాలతో పాటు ఎగుమతులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. భారత మార్కెట్లో ఐఫోన్‌లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం నుంచి లభిస్తున్న ప్రోత్సాహంతో యాపిల్ సంస్థ విస్తరణకు ఆసక్తిగా ఉంది.