Iphone 17: ఐఫోన్ 17 బేస్ మోడల్ ముందస్తు తయారీని భారత్‌లో చేపట్టనున్న యాపిల్
ఇప్పటివరకు ఈ తరహా తయారీని చైనాలో మాత్రమే నిర్వహించేది
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ తన ఐఫోన్ తయారీని భారత్‌లో మరింత వేగంగా చేపట్టాలని భావిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ఎదురైన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని చైనాకు వెలుపల తయారీని ఇతర మార్కెట్లకు మార్చిన యాపిల్ భారత కార్యకలాపాలపై ప్రత్యేక ఆసక్తి చూపించింది. ఇప్పటికే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్‌ల తయారీని ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే తన ఐఫోన్ 17 ముందస్తు తయారీని కూడా భారత్‌లోనే చేపట్టనుంది. ఇప్పటివరకు ఈ తరహా తయారీని చైనాలో మాత్రమే నిర్వహించేది. సాధారణంగా తర్వాత రాబోయే ఐఫోన్ సిరీస్ ఫోన్‌ల డిజైన్ అమెరికాలోని యాపిల్ పార్క్‌లో ఖరారు అయ్యాక, రిటైల్ మార్కెట్లో విడుదలకు ముందు చైనాలో మాత్రమే ముందస్తు తయారీని కంపెనీ చేపట్టేది. ఈ ప్రక్రియ అక్టోబర్ నుంచి మే నెల మధ్యలో జరిగేది. అయితే, ఇటీవల యాపిల్ ఈ విషయంలో చైనా వెలుపల, ముఖ్యంగా భారత్‌లో వచ్చే ఏడాది రాబోయే ఐఫోన్ 17 మోడల్ ముందస్తు తయారీని చేపట్టాలని నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ముందస్తు తయారీ తర్వాత 2025, ద్వితీయార్థంలో యాపిల్ మార్కెట్లో విడుదల చేయనుంది. గత కొన్నేళ్ల నుంచి యాపిల్ సంస్థ భారత్‌లోనే వివిధ ఐఫోన్ మోడళ్లను తయారు చేస్తోంది. దేశీయంగా తయారైన వాటినే విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోందొ. కొవిడ్-19 సమయంలో చైనాలో ఐఫోన్ తయారీ ఒప్పందం ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంట్ మూతపడటం, ఉత్పత్తి ఆగిపోవడంతో కంపెనీ తొలిసారి చైనా వెలుపల తయారీపై దృష్టి సారించింది. మొదట్లో బేస్ మోడళ్లను తయారు చేసిన తర్వాత ఈ ఏడాది ఐఫోన్ 16 ప్రో మోడళ్లను తయారు చేయడం ప్రారంభించింది.