మూడేళ్లలో దేశీయంగా 5 లక్షల మందిని నియమించుకోనున్న యాపిల్
ప్రస్తుతం యాపిల్‌కు చెందిన సరఫరా కంపెనీలు భారత్‌లో 1.50 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం, ఐఫోన్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యాపిల్ భారత్‌లో లక్షలాది మందిని నియమించుకోనుంది. వచ్చే మూడేళ్లలో దేశీయంగా 5,00,000 మందికి పైగా ఉపాధి పొందుతారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం యాపిల్‌కు చెందిన సరఫరా కంపెనీలు భారత్‌లో 1.50 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో కొత్తగా యాపిల్ సరఫరాదారు జాబితాలో చేరిన టాటా రెండు ప్లాంట్లను దక్కించుకుంది. తద్వారా టాటా అత్యధిక మందిని నియమించుకునే అవకాశం ఉందని సమాచారం. 'యాపిల్ సంస్థ దేశంలో నియామకాలను వేగవంతం చేస్తోంది. అంచనాల ప్రకారం విక్రేతలు, విడిభాగాల సరఫరాదారుల ద్వారా మరో మూడేళ్లలో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించనుందని ' ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు పీటీఐతో చెప్పారు. దీనికి సంబంధించి యాపిల్ సంస్థ స్పందించాల్సి ఉంది. వచ్చే 4-5 ఏళ్లలో దేశీయంగా ఉత్పత్తిని ఐదు రెట్లు పెంచి దాదాపు రూ. 3.32 లక్షల కోట్లకు పెంచాలని యాపిల్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగుల సంఖ్యను పెంచనుంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం, 2023లో మొట్టమొదటిసారిగా యాపిల్ ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యధిక రాబడితో అగ్రస్థానంలో నిలిచింది. అమ్మకాల సంఖ్య పరంగా శాంసంగ్ మొదటిస్థానంలో ఉంది. ఇటీవలే యాపిల్ కోటి యూనిట్ల అమ్మకాల మార్కును అధిగమించింది.