యాపిల్ కంపెనీలో రూ. 138 కోట్ల కుంభకోణం.. భారత సంతతి వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
భారత సంతతికి చెందిన యాపిల్ ఉద్యోగికి మూడేళ్ల జైలు శిక్ష పడింది.
కాలిఫోర్నియా: భారత సంతతికి చెందిన యాపిల్ ఉద్యోగికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే, యాపిల్ కంపెనీకి 19 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించాలని యునైటెడ్ స్టేట్స్ అటార్నీ ఆదేశించింది. రూ. 138 కోట్ల కుంభకోణం కేసులో ఆయనకు ఈ శిక్షను ఖరారు చేశారు. వివరాల ప్రకారం, భారత్‌కు చెందిన ధీరేంద్ర ప్రసాద్ 2008 నుండి 2018 వరకు యాపిల్ గ్లోబల్ సర్వీస్ సప్లై చెయిన్‌లో విధులు నిర్వహించాడు. ఆ సమయంలో నిధుల స్వాహ, తప్పుడు ఇన్‌వాయిస్‌లు తయారు చేయడం లాంటివి చేశారు. దీంతో ఆయనపై మార్చి 2022 లో అభియోగాలు నమోదయ్యాయి.
ధీరేంద్ర ప్రసాద్ పదేళ్ళకు పైగా కంపెనీలో పని చేస్తూ, తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని యాపిల్ కంపెనీకి కావాల్సిన విడిభాగాలను ఆర్డర్ పెట్టడం, వాటిని కంపెనీకి తెలియకుండా తిరిగి ఇతర సంస్థలకు అమ్మడం లాంటివి చేశాడు, అలాగే, ప్రోడక్ట్‌లకు సంబంధించి తప్పుడు ఇన్‌వాయిస్‌లు తయారు చేయడం, ఈ కార్యకలాపాలపై రెండు వెండర్ కంపెనీల యజమానులతో కలిసి కుట్ర పన్ని, వచ్చిన ఆదాయంపై పన్ను ఎగవేయడం లాంటివి చేశాడు. అతను దాదాపు కంపెనీని $17 మిలియన్లకు పైగా మోసం చేశాడు. ఈ తప్పులను అతను అంగీకరించడంతో తాజాగా శిక్షను ఖరారు చేశారు.