Amazon India: పండుగ సీజన్ కోసం అమెజాన్ ఇండియా లక్షకు పైగా ఉద్యోగాలు
డెలివరీ కార్యకలాపాల్లో మెరుగైన సేవలు, నెట్‌వర్క్ కోసం 1,10,000 కంటే ఎక్కువ సీజనల్ ఉద్యోగులను తీసుకోవాలని తెలిపింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైంది. దీనికోసం ఇప్పటికే చాలా ఈ-కామర్స్ కంపెనీలు సిద్ధమయ్యాయి. పండుగ సీజన్ డిమాండ్‌ను తీర్చేందుకు దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టించనుంది. డెలివరీ కార్యకలాపాల్లో మెరుగైన సేవలు, నెట్‌వర్క్ కోసం 1,10,000 కంటే ఎక్కువ సీజనల్ ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించినట్టు అమెజాన్ ఇండియా గురువారం ప్రకటనలో తెలిపింది. ఈ ఉద్యోగాలు ప్రధానంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణె, బెంగళూరు, కోల్‌కతా, లక్నో, చెన్నై వంటి నగరాల్లో ఉండనున్నాయి. అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో సేవలను పెంచేందుకు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. 1.1 లక్షలకు పైగా ఉద్యోగులను తీసుకుంటాం. ఈసారి పండుగ సీజన్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ నియామకాల్లో ఎక్కువమంది పండుగ సీజన్ తర్వాత కూడా కొనసాగుతారని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్-ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ అన్నారు. వీరిలో ఎక్కువ మంది ఇప్పటికే ఆన్‌బోర్డ్‌లో ఉన్నారని కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాకుండా వేలాది మంది మహిళలు, దాదాపు 1,900 మంది దివ్యాంగులను నియమించుకున్నట్టు కంపెనీ వెల్లడించింది.