ముంబై TO దోహా.. ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ కార్యకలాపాలు స్టార్ట్..
దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ మార్చి 28 నుంచి అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ మార్చి 28 నుంచి అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ముంబై నుంచి దోహాకు వారానికి నాలుగు నాన్‌స్టాప్ విమానాలను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఖాతర్-ఇండియా మధ్య ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుందని ఆకాశ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం టికెట్లను ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ www.akasaair.com, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లలో టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఆకాశ ఎయిర్ ప్రారంభమైన 19 నెలల కాలంలోనే వేగంగా అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించడం విశేషం. ఈ ఎయిర్‌లైన్ ప్రస్తుతం 4 శాతం మార్కెట్‌ను సాధించగా, ఇండిగో 60 శాతం, టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ సమిష్టిగా 26 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. దోహా నగరం ఖతార్ రాజధాని. ఇది మధ్యప్రాచ్య ప్రాంతంలోని కీలకమైన వాణిజ్య నగరం. సాంస్కృతిక వారసత్వానికి కూడా ప్రసిద్ధి చెందింది.
ఆకాశ ఎయిర్ CEO వినయ్ దూబే మాట్లాడుతూ, దోహాకు అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రకటించడం సంతోషంగా ఉంది. కీలకమైన భారతీయ వాణిజ్య కేంద్రమైన ముంబైతో నేరుగా దోహాను కనెక్ట్ చేయడం ద్వారా పర్యాటకం, వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం అవుతాయి. రెండు దేశాల మధ్య ప్రయాణించే వారికి ప్రయాణం సులభం అవుతుందని అన్నారు.