Air India: కొత్తగా 100 ఎయిర్ బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఎయిర్ ఇండియా
గతంలో కంపెనీ ఆర్డర్ చేసిన 470 విమానాల ఆర్డర్‌కు అదనంగా కొత్త ఆర్డర్ ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ఇండియా మరోసారి పెద్ద సంఖ్యలో విమానాలను కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది. 100 ఎయిర్‌బస్ విమానాలను ఇప్పటికే ఆర్డర్ చేశామని, అందులో 10 వైడ్‌బాడీ ఏ350, 90 నారోబాడా ఏ320 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయని ఎయిర్ఇండియా సోమవారం ప్రకటనలో వెల్లడించింది. గతంలో కంపెనీ ఆర్డర్ చేసిన 470 విమానాల ఆర్డర్‌కు అదనంగా కొత్త ఆర్డర్ ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. కొత్త విమానాల కొనుగోలు మాత్రమే కాకుండా ఏ350 విమానాల నిర్వహణ, విడిభాగాల కోసం ఎయిర్‌బస్‌తో ఒప్పందం చేసుకుంది. 2022లో ఎయిర్ఇండియాను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి టాటా గ్రూప్ కొత్త విమానాల ఆర్డర్లు, కంపెనీ లోగో, బ్రాండింగ్ సహా అప్‌గ్రేడ్ కోసం కోట్లాదిగా ఖర్చు చేసింది. ఇటీవల సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో జాయింట్ వెంచర్ అయిన విస్తారాను ఎయిర్ ఇండియాలో విలీనం చేసింది. 2023లో ఎయిరిండియా సంస్థ ఎయిర్‌బస్ నుంచి 250 విమానాను, బోయింగ్ నుంచి 220 విమానాల కోసం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.