నెలకు 600 మంది సిబ్బంది నియామకాలు: ఎయిర్ ఇండియా సీఈఓ!
గత ఏడాది జనవరిలో ప్రభుత్వం నుంచి విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన టాటా సంస్థ అభివృద్ధి ప్రణాళికను ప్రకటించింది
న్యూఢిల్లీ: గత ఏడాది జనవరిలో ప్రభుత్వం నుంచి విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన టాటా సంస్థ అభివృద్ధి ప్రణాళికను ప్రకటించింది. ఎయిర్ ఇండియా ఐదేళ్ల లక్ష్యంతో ప్రారంభించిన చర్యలు సానుకూలంగా కొనసాగుతున్నాయని సంస్థ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ అన్నారు.
ప్రస్తుతానికి సంస్థ నెలకు 550 మంది కేబిన్ సిబ్బందితో పాటు 50 మంది పైలట్ల నియామకాలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. భవిష్యత్తులోనూ ఈ ధోరణి కొనసాగుతుందని, ఇప్పటికే బోయింగ్ నుంచి 220 విమానాలను, ఎయిర్‌బస్ నుంచి మరో 250 విమానాలను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నట్టు క్యాంప్‌బెల్ వివరించారు. అందులో భాగంగానే పైలట్లు, కేబిన్ సిబ్బంది నియామకాలను వేగవంతం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాదిలోనే కాకుండా వచ్చే ఏడాది కూడా నియామకాలు కొనసాగుతాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఎయిర్ ఏషియాలను ఎయిర్ ఇండియాలో విలీనం చేయాలనే నిబంధనలను బట్టి ఎంతమంది సిబ్బంది అవసరమనేది అంచనా వేయాలని, అందుకనుగుణంగానే నియామకాలు ఉంటాయని క్యాంప్‌బెల్ అన్నారు. ఈ నెలలోనే ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 500 మంది పైలట్లను, 2,400 మంది కేబిన్ సిబ్బందిని తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.