డెబిట్ కార్డులను దాటేసిన క్రెడిట్ కార్డు లావాదేవీలు!

సాధారణంగా భారత్ డెబిట్ కార్డులను ఎక్కువగా వినియోగించే దేశం అయినప్పటికీ ఇటీవల క్రెడిట్ కార్డుల లావాదేవీలు గణనీయంగా పెరిగాయి.

Update: 2023-06-13 09:54 GMT

ముంబై: సాధారణంగా భారత్ డెబిట్ కార్డులను ఎక్కువగా వినియోగించే దేశం అయినప్పటికీ ఇటీవల క్రెడిట్ కార్డుల లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. తాజా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డేటా ప్రకారం, గతేడాది ఏప్రిల్‌లో మొత్తం 22 కోట్ల క్రెడిట్ కార్డు లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది ఏప్రిల్‌లో అది 25 కోట్లకు చేరుకుంది. సమీక్షించిన నెలలో క్రెడిట్ కార్డు లావాదేవీల మొత్తం విలువ రూ. 1.33 లక్షల కోట్లు ఉండగా, డెబిట్ కార్డుల లావాదేవీల విలువ రూ. 53 లక్షలు కావడం గమనార్హం.

గత కొన్నేళ్లుగా భారత్‌లో క్రెడిట్ కార్డు లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. గతేడాదిలో క్రెడిట్ కార్డు స్వైప్‌ల సంఖ్య 20 శాతం పెరిగితే, డెబిట్ కార్డుల సంఖ్య 31 శాతం క్షీణించింది. గతేడాది వరకు 7.5 కోట్ల క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 8.5 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. మూడేళ్ల క్రితం వరకు దేశంలో 5 కోట్ల కంటే తక్కువ క్రెడిట్ కార్డులు ఉండేవి.

ప్రధానంగా డెబిట్ కార్డుల వినియోగాన్ని యూపీఐ విధానం తగ్గించేసింది. ఇదే సమయంలో క్రెడిట్ కార్డుల వ్యవస్థ కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది మేలో 536 కోట్ల లావాదేవీలు యూపీఐ విధానంలో జరిగాయి. ఇది గతేడాదిలో జరిగిన 254 కోట్ల యూపీఐ లావాదేవీల కంటే రెట్టింపు కావడం విశేషం.

ఏప్రిల్‌లో ఆన్‌లైన్ ద్వారా 81 కోట్ల క్రెడిట్ కార్డుల లావాదేవీలు జరిగితే, డెబిట్ కార్డు లావాదేవీలు 16 కోట్లుగా ఉన్నాయి. దేశీయంగా గత కొంతకాలం నుంచి కో-బ్రాండింగ్ క్రెడిట్ కార్డులు వేగవంతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మింత్రా, పేటీఎం లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు వివిధ బ్యాంకులతో కలిసి కో-బ్రాండెడ్ కార్డులను విడుదల చేస్తున్నాయి. అందుకే క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more: రైతులకు గుడ్‌న్యూస్: అకౌంట్లోకి PM కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే..!

Tags:    

Similar News