Global MNCs: భారత్‌లో విస్తరణకు సిద్ధంగా ఉన్న గ్లోబల్ ఫార్చ్యూన్-500 కంపెనీలు

జీసీసీ అనేవి అంతర్జాతీయ ఎంఎన్‌సీలకు చెందిన ఔట్‌పోస్ట్ లాంటివి. ఇవి వివిధ దేశాల్లో తమ సేవలందించేందుకు ఏర్పాటు చేస్తారు.

Update: 2024-09-11 15:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన ఐదేళ్ల నుంచి పెరుగుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీ) భారత టెక్ విస్తరణను కొత్త దశకు చేరుస్తున్నాయి. తాజాగా ఓ నివేదిక ప్రకారం, ప్రపంచ ఫార్చ్యూన్-500 కంపెనీల్లో 70 శాతం 2030 నాటికి భారత్‌తో తమ ఉనికిని వేగంగా విస్తరించాలని భావిస్తున్నాయి. జీసీసీ అనేవి అంతర్జాతీయ ఎంఎన్‌సీలకు చెందిన ఔట్‌పోస్ట్ లాంటివి. ఇవి వివిధ దేశాల్లో తమ కంపెనీ సేవలందించేందుకు ఏర్పాటు చేస్తారు. నాస్కామ్, జినోవ్ సంయుక్తంగా రూపొందించిన 'ఇండియా జీసీసీ ల్యాండ్‌స్కేప్ రిపోర్ట్: 5-ఇయర్ జర్నీ' నివేదిక ప్రకారం.. 2030 నాటికి జీసీసీ ఆదాయం 105 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. ఇది ప్రస్తుతం ఉన్న 64.6 బిలియన్ డాలర్ల కంటే 9-10 శాతం వృద్ధి. అలాగే, ప్రస్తుతం దేశంలో జీసీసీల సంఖ్య 1,700 ఉండగా, ఇవి 2030 నాటికి 2,200కి చేరుకోవచ్చని నివేదిక అభిప్రాయపడింది. ముఖ్యంగా జీసీసీల విస్తరణకు ఏఐ టెక్నాలజీతో పాటు ఇంజనీరింగ్, ఆర్అండ్‌డీ వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. భారతీయ జీసీఈల్లో 6,500కి పైగా ఉద్యోగాలు ఉండగా, ఇది రాబోయే ఆరేళ్ల కాలంలో 30 వేలకు చేరనుంది. ప్రధానంగా భారత మార్కెట్లో జీసీసీల విస్తరణ మొత్తం పరిశ్రమ వృద్ధికి దోహదపడనుందని నివేదిక వివరించింది. 2019-2024 మధ్యకాలంలో జీసీసీలు టైర్-2,టైర్-3 నగరాలకు విస్తరించాయి. దీనివల్ల వాటి ఆదాయం 60 శాతం పెరగడమే కాకుండా ఉద్యోగుల సంఖ్య 36 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది.  

Tags:    

Similar News