బ్యాంకులపై భారీగా పెరుగుతున్న ఫిర్యాదులు
గతేడాది ఆర్‌బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద వచ్చిన ఫిర్యాదులు 68.2 శాతం పెరిగి, 7,03,000కి ఫిర్యాదులు చేరాయి
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బ్యాంకింగ్ సేవలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజా గణాంకాల ప్రకారం గత రెండు ఆర్థిక సంవత్సరాల కంటే ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయి. గతేడాది ఆర్‌బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద వచ్చిన ఫిర్యాదులు 68.2 శాతం పెరిగాయి. సంఖ్యా పరంగా 7,03,000కి ఫిర్యాదులు చేరాయి. అంతకుముందు 2020-21లో ఫిర్యాదులు 15.7 శాతం పెరగ్గా, 2021-22లో 9.4 శాతం పెరుగుదల నమోదైంది. కానీ ఈసారి ఫిర్యాదులు భారీగా పెరిగాయి. వినియోగదారులకు బ్యాంకింగ్ సమస్యల గురించి తెలిసేందుకు ఆర్‌బీఐ చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, అందుకు అవసరమైన ప్రక్రియను మరింత సులభతరం చేయడం వల్లనే ఫిర్యాదులు అత్యధికంగా పెరిగాయి. గతంలో కంటే ఇప్పుడు బ్యాంకింగ్ సమస్యలను, ఫిర్యాదులను ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌కు సులభంగా చేర్చవచ్చు.
ఎలాంటి ఫిర్యాదులు ఎక్కువంటే..
మొబైల్/ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్‌కు సంబంధించి మొత్తం బ్యాంకులు, నాన్-బ్యాంక్ పేమెంట్స్ సిస్టమ్‌లపై వచ్చిన ఫిర్యాదుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో ఎన్‌బీఎఫ్‌సీలపై నిబంధనలకు సంబంధించిన ఫిర్యాదులు మొత్తం జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. మొత్తం ఫిర్యాదుల్లో గణనీయమైన భాగం అంటే 57.48 శాతం పరస్పర సహకారం, రాజీ, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడ్డాయి. మిగిలిన ఫిర్యాదులు రిజెక్ట్ చేయబడటం, ఉపసంహరణ, పరిష్కరించబడ్డాయి.
చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో అంబుడ్స్‌మన్ ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో చాలా తక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి. అంబుడ్స్‌మన్ స్కీమ్ చొరవ కారణంగా పట్టణ, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి. మొత్తం ఫిర్యాదుల్లో 83.78 శాతం బ్యాంకులపైనే ఉన్నాయి.
సాధారణ ఫిర్యాదులు..
సాధారణ ఫిర్యాదుల్లో మోసపూరిత డిజిటల్ లావాదేవీలు, లావాదేవీల తిరిగి పొందడంలో ఆలస్యం, రుణాల నిబంధనలకు సంబంధించి స్పష్టమైన కమ్యూనికేషన్ లేకపోవడం, పెన్షన్ రిజల్యూషన్ సమస్యలు, మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు, నకిలీ ఉత్పత్తుల అమ్మకాలు వంటివి ఉన్నాయి. అలాగే, క్రెడిట్ సమాచారాన్ని అందించడంలో ఆలస్యం, రికవరీ ఏజెంట్లు నియంత్రణ మార్గదర్శకాలను పాటించకపోవడం వంటి ఫిర్యాదులు ఉన్నాయి.
ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌కు అందించ మొత్తం ఫిర్యాదుల్లో 2,34,000 అంబుడ్స్‌మన్ కార్యాలయం నేరుగా నిర్వహించగా, సెంట్రలైజ్‌డ్ రిసీప్ట్, ప్రాసెసింగ్ సెంటర్(సీఆర్‌పీసీ) 4,68,000 ఫిర్యాదులను పరిష్కరించింది. భౌతికంగా అందించ ఫిర్యాదులను సీఆర్‌పీసీ కీలకంగా ఉంటుంది. ఇది ఫిర్యాదుల నిర్వహణ, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.