Bangladesh: బంగ్లాదేశ్ వరదల్లో 54 మంది మృతి.. ప్రమాదంలో 20 లక్షల మంది పిల్లలు

సుమారు 11 జిల్లాలు వరదల ధాటికి ప్రభావితమయ్యాయి. సుమారు 50 లక్షల మంది ఈ వరదల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది.

Update: 2024-08-30 16:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించగా, ఇప్పటివరకు 54 మంది మరణించినట్టు యూనిసెఫ్ అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో సుమారు 11 జిల్లాలు వరదల ధాటికి ప్రభావితమయ్యాయి. సుమారు 50 లక్షల మంది ఈ వరదల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 20 లక్షల మంది పిల్లలు ప్రమాదంలో ఉన్నారని యూనిసెఫ్ పేర్కొంది. విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఫెని జిల్లాలో అత్యధికంగా 19 మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. భారీ వర్షాలు, నదుల ప్రవాహం కారణంగా సంభవించిన వరద ప్రభావిత ప్రాంతాల్లో లక్షకు పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఫెని, కుమిల్లా, నోఖాలి, బ్రాహ్మణబారియా, చిట్టగాంగ్, కాక్స్ బజార్, సిలెట్, హబిగంజ్ వంటి 11 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. షైలెట్, హోబిగంజ్, చటోగ్రామ్‌లలో వరద పరిస్థితి నుంచి బయటపడుతున్న సంకేతాలను కనిపిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. లక్షలాది మంది పిల్లలు, కుటుంబాలు ఆహారం, అత్యవసర సహాయ సామాగ్రి లేకుండా చిక్కుకుపోయారు. ప్రభుత్వ సిబ్బంది, వాలంటీర్లు రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వెళ్లేందుకు కష్టంగా ఉంది. వర్షాలు కురుస్తుండటంతో రానున్న రోజుల్లో మరింత మంది ప్రజలు వరదలకు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయని యూనిసెఫ్ హెచ్చరించింది.

Tags:    

Similar News