ఏడాది చివరి కల్లా 3 కోట్లకు 5జీ వినియోగదారులు!

దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి.

Update: 2023-10-03 15:06 GMT

న్యూఢిల్లీ: దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ప్రధాన నగరాలతో పాటు చిన్న పట్టణాల్లోనూ ఆల్ట్రా హై-స్పీడ్ సేవలు విస్తరిస్తున్నాయి. ఇప్పటివరకూ దేశీయంగా దాదాపు కోటి మది 5జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ఏడాది చివరి నాటికి ఇది మూడు కోట్లకు చేరుకోవచ్చని ఎరిక్సన్ అంచనా వేసింది. ఇటీవల 5జీ సేవల వినియోగం గురించి ఎరిక్సన్ అంతర్జాతీయంగా సర్వే చేపట్టింది. ఆ నివేదిక ప్రకారం, భారత్‌లో 5జీ ఇంటర్నెట్‌ను వీడియో కాల్, మొబైల్ గేమ్‌లు, హై-క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్‌ల కోసం ఎక్కువగా వాడుతున్నారు. అమెరికా, చైనా, బ్రిటన్, దక్షిణ కొరియా లాంటి దేశాల కంటే భారత్‌లో వారానికి 2 గంటలు ఎక్కువ 5జీ సేవలను ఉపయోగిస్తున్నారు.

15 శాతం మంది గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, మ్యూజిక్ కోసం ఇప్పుడున్న ధరల కంటే 14 శాతం ఎక్కువ చెల్లించి 5జీ డేటా ప్లాన్‌లను వాడుతున్నారు. దేశంలో యూజర్లు 4జీతో పోలిస్తే 5జీ నెట్‌వర్క్ విషయంలో 30 శాతం ఎక్కువ సంతృప్తికరంగా ఉన్నారని ఎరిక్సన్ సర్వేలో తేలింది. గతేడాది అక్టోబర్ 1 నుంచి దేశీయంగా 5జీ సేవలు మొదలయ్యాయి. ఈ ఏడాది కాలంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌కు మాత్రమే 5జీ విభాగంలో ఆధిపత్యం కలిగి ఉన్నాయి. 5జీ సేవలను వేగవంతం చేసేందుకు ఈ కంపెనీలు వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాయని ఎరిక్సన్ పేర్కొంది.


Similar News