బీజేపీతో దోస్తీపై బొత్స క్లారిటీ

       వైఎస్సార్సీపీ నేతల్లో బొత్స సత్యనారాయణది ప్రత్యేక శైలి. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పడంలో బొత్స ముందుంటారు. మీడియా సమావేశాల్లో ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా మీడియాను ఎదురు ప్రశ్నించాలన్నా బొత్స తరువాతే ఎవరైనా.. బొత్స ఏదన్నా ముందుగా మాట్లాడితే.. ఆ తరువాత అది జరుగుతుందన్నది ఆపార్టీ వర్గాల్లో విశ్వాసం. ఈ నేపథ్యంలో బొత్స వైజాగ్ వేదికగా బీజేపీతో దోస్తీపై చేసిన వ్యఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.        వైజాగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన […]

Update: 2020-02-15 01:54 GMT

వైఎస్సార్సీపీ నేతల్లో బొత్స సత్యనారాయణది ప్రత్యేక శైలి. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పడంలో బొత్స ముందుంటారు. మీడియా సమావేశాల్లో ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా మీడియాను ఎదురు ప్రశ్నించాలన్నా బొత్స తరువాతే ఎవరైనా.. బొత్స ఏదన్నా ముందుగా మాట్లాడితే.. ఆ తరువాత అది జరుగుతుందన్నది ఆపార్టీ వర్గాల్లో విశ్వాసం. ఈ నేపథ్యంలో బొత్స వైజాగ్ వేదికగా బీజేపీతో దోస్తీపై చేసిన వ్యఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

వైజాగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీయేలో చేరుతామన్నారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే ఎవరినైనా గడ్డం పట్టుకుని బతిమిలాడే స్థాయికి దిగజారుతామని చెప్పారు. బీజేపీతో ప్రస్తుతం మైత్రి ఉందా? అంటే ఉందని, లేదా? అంటే లేదని తికమక సమాధానం చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడాల్సిన అవసరం తమకు ఉందా? అని మీడియాను ప్రశ్నించారు. బీచ్ రోడ్‌లోనే పురపాలక శాఖ అతిథి గృహం ప్రాంగణంలో స్టేట్ అర్బన్ డెవలెప్‌మెంట్ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు.

బొత్స గతంలో అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని ప్రకటించి కలకలం రేపారు. అప్పట్లో టీడీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. ఆ తరువాత అదే నిజమైంది. అమరావతి నుంచి రాజధాని తరలుతోంది. ఇప్పుడు బీజేపీతో మైత్రిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కేంద్రంలో వైఎస్సార్సీపీ చేరుతుందన్న వార్తలు, ఊహలు వ్యాప్తి చెందాయి. వైఎస్సార్సీపీతో బీజేపీ కీలక నేతలు సన్నిహితంగా ఉన్నప్పటికీ రెండు పార్టీల మధ్య అవగాహన మాత్రం లేదు.

అయితే బొత్స వ్యాఖ్యలు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరనుందంటూ పరిశీలకులు పేర్కొంటున్నారు. నిప్పు లేకుండా పొగ రాదని, కేంద్రంలో చేరిక గురించి బొత్స అలా చెప్పారంటే.. త్వరలోనే కేంద్ర కేబినెట్‌లో వైఎస్సార్సీపీ భాగం కానుందన్న ప్రచారం ఊపందుకుంది. గతంలో ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇంచుమించు గల్లంతైంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ లాభపడినట్టు చరిత్ర నిరూపించలేదు. తాజాగా జగన్‌తో పొత్తు బీజేపీకి లాభమా? లేక వైఎస్సార్సీపీకి లాభమా? అన్నది కాలమేతేల్చనుంది.

Tags:    

Similar News