తెలంగాణలో చరిత్రలో.. ‘డిసెంబర్ 9’ చారిత్రక రోజు

డిసెంబర్ 9.. తెలంగాణ చరిత్రలో ప్రత్యేకత కలిగిన తేదీ. ప్రజా ఉద్యమాలు, కేసీఆర్ దీక్షకు స్పందించిన అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. సోనియాగాంధీ బర్త్ డే అయిన ఈ రోజున అప్పటి హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్ట ప్రకటన చేశారు. సీమాంధ్ర ఉద్యమ ఆ ప్రకటనను వెనక్కి నెట్టింది. అదే నెల 23వ తేదీన దానికి విరుద్ధమైన ప్రకటన వచ్చేలా చేసింది. కేసీఆర్​ఆమరణ దీక్ష, ప్రజల పోరాట ఫలితంగానే […]

Update: 2021-12-08 21:06 GMT

డిసెంబర్ 9.. తెలంగాణ చరిత్రలో ప్రత్యేకత కలిగిన తేదీ. ప్రజా ఉద్యమాలు, కేసీఆర్ దీక్షకు స్పందించిన అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. సోనియాగాంధీ బర్త్ డే అయిన ఈ రోజున అప్పటి హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్ట ప్రకటన చేశారు. సీమాంధ్ర ఉద్యమ ఆ ప్రకటనను వెనక్కి నెట్టింది. అదే నెల 23వ తేదీన దానికి విరుద్ధమైన ప్రకటన వచ్చేలా చేసింది. కేసీఆర్​ఆమరణ దీక్ష, ప్రజల పోరాట ఫలితంగానే స్వరాష్ట్రం సిద్ధించింది అంటున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్​తో ‘దిశ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి ఏటా డిసెంబరు 9వ తేదీ రాగానే తెలంగాణ ప్రజలందరికీ అప్పట్లో కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటన గుర్తుకు వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆయన మాటలు ప్రజలకు, ఉద్యమకారులకు ఎక్కడలేని సంతోషాన్ని ఇచ్చాయి. ఆ సంబురం ఎంతోసేపు నిలువలేదు. మళ్లీ ఐదేళ్ల విరామం తర్వాత పార్లమెంటులో బిల్లు పాస్ కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆరోజుకు ఉన్న ప్రాధాన్యం, జరిగిన కసరత్తు, పరిణామాలపై నాటి ఉద్యమకారుడు, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ తోముఖాముఖి..

రెండు ఘట్టాలు కీలకం

2009వ సంవత్సరం.. డిసెంబరు 9వ తేదీకి రెండు ప్రాధాన్యాలున్నాయి. ఒకటి, ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో ఆయన 11వ రోజు ఆమరణ దీక్షలో ఉన్నారు. రెండోది, తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం “ది ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ విల్ బి ఇనిషియేటెడ్” (తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది) అంటూ అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన చేయడం.

కేసీఆర్​దీక్షే ప్రకటనకు పునాది

కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకోవడమే అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటనకు పునాది. అదే తెలంగాణ భవిష్యత్తుతో ముడిపడింది. చరిత్రలో నిలిచిపోయింది. ప్రకటన వస్తుందని ముందుగా ఊహించలేదు. కానీ ఏదో జరుగుతున్నది అనే విషయం మాత్రం అర్థమైంది. అంతకు ముందురోజే అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యగారు ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అధిష్ఠానమే పిలిపించుకున్నది. తెలంగాణకు సంబంధించిన అంశాన్నే చర్చించిందని ఆ ప్రకటనతో క్లారిటీ వచ్చింది. అంతకు ముందే నాకు, ప్రొఫెసర్ జయశంకర్ గారికి కొంత నమ్మకం ఉంది. రోశయ్యగారు ఢిల్లీ నుంచే నాకు ఫోన్ చేశారు. కాంగ్రెస్ పెద్దల నుంచి మీకు ఫోన్ వస్తుంది అని చెప్పారు. వారు చెప్పే మాటలను మీరు కేసీఆర్ గారికి తెలియజేయాలన్నారు.

వాళ్లిద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నారు

రోశయ్యగారు చెప్పినట్లుగానే కొద్దిసేపటి తర్వాత చిదంబరంగారి నుంచి ఫోన్ వచ్చింది. కేసీఆర్‌తోనే మాట్లాడారు. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో స్వయంగా నేను వినలేదు. కానీ ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి ప్రకటన ఇవ్వబోతున్నదీ మాట్లాడుకున్నట్లున్నారు. చేయబోయే ప్రకటనను చదివి వినిపించారనుకుంటా. ప్రకటన చేసిన వెంటనే దీక్షను విరమించుకోవాల్సిందిగా కోరినట్లున్నారు. అప్పుడు జయశంకర్‌ గారు నా పక్కనే ఉన్నారు. ఆ తర్వాతనే చిదంబరంగారు ఢిల్లీలో మీడియా సమక్షంలో తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేశారు. వెంటనే దీక్ష విరమణకు కేసీఆర్ సిద్ధమయ్యారు.

ప్రకటనపై రోశయ్యకు తెలియకపోవచ్చు

రోశయ్యగారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే కావచ్చు. ముఖ్యమంత్రి స్థాయిలో రాష్ట్రంలోని వాస్తవిక పరిణామాలను సోనియాగాంధీకి చెప్పి ఉంటారనే అనుకుంటున్నాను. తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని కోరుకుంటున్నారనే విషయాన్ని ఆమెకు కన్వే చేశారనే భావిస్తున్నాను. తెలంగాణ పరిస్థితుల్ని సోనియాగాంధీకి రోశయ్యగారు వివరించారు. కానీ తీసుకున్న నిర్ణయం, చేయబోయే ప్రకటనపై ఆయనకు పార్టీ నేతలు ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ ఆ గంట లోపల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే రోశయ్యగారికి కూడా చెప్పలేదేమో అని అనిపించింది. ఎందుకంటే, ఆయన ఫ్లైట్‌‌లో ఉండగానే చిదంబరం ప్రకటన చేశారు. షెడ్యూలు ప్రకారం ఆయన ఫ్లైట్ దిగగానే నిమ్స్ ఆస్పత్రికి వచ్చి పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్‌కు చెప్పాల్సి ఉండె. కానీ అప్పటికే చిదంబరం చెప్పేయడంతో రాలేదు.

కొడుకును, కూతురుని రానివ్వొద్దన్నారు

కేసీఆర్ ఆమరణ దీక్షలో ఉండడంతో బాగా నీరసంగా ఉన్నారు. తెలంగాణ కోసం ప్రాణం ఏమైపోయినా ఫర్వాలేదనే స్పష్టమైన వైఖరితోనే ఉన్నారు. కానీ రూం లోకి భార్య శోభమ్మను తప్ప ఇతర కుటుంబసభ్యులెవరినీ రానివ్వలేదు. నేను, జయశంకర్ సార్​మాత్రమే ఉన్నాం. కొడుకు, కూతురు, బంధువులు వస్తే వారు ఆందోళన పడతారు. తనలోనూ ఎమోషన్స్ కలుగుతాయని కేసీఆర్​చెప్పారు. చిదంబరం ప్రకటన తర్వాత అనుకున్నది సాధించామన్న విజయగర్వాన్ని మాత్రం నాతో, జయశంకర్‌గారితో పంచుకున్నారు.

రెండు రోజులకే రివర్స్!

డిసెంబరు 9న చిదంబరం ప్రకటన ఎంత సంతోషం ఇచ్చిందో ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంతే డిజప్పాయింట్ చేశాయి. మరుసటి రోజున అసెంబ్లీ సెషన్‌లో రోశయ్య ప్రకటన చేయాల్సి ఉన్నది. కానీ చిదంబరం ప్రకటన అప్పటికే అందరికీ తెలిసిపోయింది. అసెంబ్లీ వేదికగానే పార్టీలతో సంబంధం లేకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా ఒక్కటయ్యారు. వ్యతిరేకించడం మొదలుపెట్టారు. రాజీనామాల బాట ఎంచుకున్నారు. మొదటి రెండు రోజులు లైట్‌గానే తీసుకున్నాం. కానీ ఆ తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు పెరిగిపోయాయి.

ఇది ఎటో పోతున్నదనే టెన్షన్ మొదలైంది. డిసెంబరు 9 ప్రకటన రివర్స్ అవుతుందేమో అనే అనుమానం కూడా వచ్చింది. అనుకున్నట్లే జరిగింది. డిసెంబరు 23న కేంద్రం నుంచి దానికి విరుద్ధమైన ప్రకటన వచ్చింది. సీమాంధ్రలోని పరిణామాలే అందుకు కారణం. నిజానికి డిసెంబరు 9న ప్రకటన చేసిన రోజునే నన్ను, ప్రొఫెసర్ జయశంకర్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా చిదంబరం సూచించారు. ఆ ప్రకారం మరుసటి రోజు ఇద్దరం ఢిల్లీ వెళ్ళాం. అక్కడే ఉన్నాం. కానీ చిదంబరంతో భేటీ కాలేకపోయాం. హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అని చిదంబరం చెప్పారు. అప్పటికే మాకు అనుమానం వచ్చింది.దాని పర్యవసానమే డిసెంబరు 23 ప్రకటన.

ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు ఫలించింది

టీఆర్ఎస్‌కు ఉన్నది ఇద్దరు ఎంపీలే. ఆంధ్ర నుంచి కాంగ్రెస్ పార్టీకి 17 మంది ఎంపీలు ఉన్నారు. వారంతా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. కానీ తెలంగాణలోని అన్ని పార్టీల ఎంపీలూ అనుకూలంగా ఉన్నారు. దీనికి తోడు కేసీఆర్ గతంలో జరిపిన సంప్రదింపులతో ప్రాంతీయ పార్టీల మద్దతు ఉన్నది. కచ్చితంగా తెలంగాణకు ఆ పార్టీలు సపోర్టుగా ఉంటాయనే నమ్మకం ఉన్నది. తెలంగాణ ఏర్పడడం ఖాయం అనేది మమ్మల్ని నడిపించింది. అన్నింటికీ మించి తెలంగాణ ప్రజలు సంపూర్ణ సహకారం ఉన్నది.

Tags:    

Similar News