ఆత్మసౌందర్యమే.. అందం
దిశ, ఫీచర్స్ : ‘పైపై మెరుగులకు మోసపోకు.. స్ప్రైట్ తీరుస్తుంది మీ దాహం’ ఇదో పాపులర్ యాడ్. నిజానికి కూడా ఈ సమాజం మెరిసే బంగారానికే ఆకర్షితమవుతుంది. శారీరక ఆకర్షణే ఇప్పుడు సర్వత్రా రాజ్యమేలుతోంది. బాహ్య సౌందర్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నాం. ఈ క్రమంలోనే జీరోసైజ్ నడుము, నారోసైజ్ ముక్కు, చిన్ని పెదాలు, చిట్టి బుగ్గలు.. అంటూ కొలతలన్నీ పర్‌ఫెక్ట్ ఉండాలని కోరుకునేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పోనీ కాస్త బొద్దుగా ఉంటే చాలు.. ఓవైపు […]
దిశ, ఫీచర్స్ : ‘పైపై మెరుగులకు మోసపోకు.. స్ప్రైట్ తీరుస్తుంది మీ దాహం’ ఇదో పాపులర్ యాడ్. నిజానికి కూడా ఈ సమాజం మెరిసే బంగారానికే ఆకర్షితమవుతుంది. శారీరక ఆకర్షణే ఇప్పుడు సర్వత్రా రాజ్యమేలుతోంది. బాహ్య సౌందర్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నాం. ఈ క్రమంలోనే జీరోసైజ్ నడుము, నారోసైజ్ ముక్కు, చిన్ని పెదాలు, చిట్టి బుగ్గలు.. అంటూ కొలతలన్నీ పర్‌ఫెక్ట్ ఉండాలని కోరుకునేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పోనీ కాస్త బొద్దుగా ఉంటే చాలు.. ఓవైపు ట్రోలింగ్, బాడీ షేమింగ్. సన్నజాజులకు మాత్రమే మనసుంటుందా? ముద్ద మందారాలకేం తక్కువ? అనే ఆలోచనా దృక్పథాన్ని ఎప్పుడో మరిచాం. బాహ్య సౌందర్యం మన వ్యక్తిత్వ వికాసానికి ఏమైనా దోహదపడుతుందా? అంటే లేదు. నిజమైన అందం మనలోని సౌందర్యాన్ని గ్రహించి అంగీకరించడంలోనే ఉంటుంది. బాడీ పాజిటివిటీ అంటే ఉబెసిటీని ప్రచారం చేయడం కాదు. వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయడం అంటూ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ లావుగా ఉన్న మహిళల్లో అవగాహన పెంచుతున్నారు.
దశాబ్దాలుగా కొన్ని రకాల శరీర సౌష్టవాలు, సైజులు సమాజంలో ఆమోదయోగ్యమైనవిగా గుర్తింపు పొందుతున్నాయి. ఈ ప్రమాణాలకు సరిపోని చాలా మంది సొసైటీలో హేళనకు గురికావాల్సి వస్తుండగా.. ఈ తరహా కామెంట్స్ పట్ల బాడీ డిస్‌శాటిస్‌ఫాక్షన్ పెరిగిపోయి అన్ హెల్తీ బిహేవియర్‌కు దారితీస్తోంది. ఇలాంటి వివక్ష, అవహేళన నుంచే ‘బాడీ పాజిటివిటీ’ మూవ్‌మెంట్ ప్రారంభమైంది. మన(నలుపు, తెలుపు, పొట్టి, పొడువు, లావు, సన్నం)లో ఎవరూ 100శాతం పర్‌ఫెక్ట్ ఉండలేరు. మన శరీరాన్ని మనం ప్రేమించడమే ‘బాడీ పాజిటివిటీ’. అయితే ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చిన ఉద్యమం కాదు. ‘బాడీ పాజిటివిటీ’ ఆలోచనలు వంద సంవత్సరాలుగా ఉన్నాయి. కానీ ఇటీవలే ఒక సామాజిక ఉద్యమంగా మారింది. తమ శరీర ఆకృతిని మార్చడానికి కార్సెట్ల(a woman’s tightly fitting undergarment extending from below the chest to the hips) ను ఉపయోగించమని 1850లోనే కొంతమంది మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నాటి నుంచి నేటి మహిళల వరకు సమాజంలో, ప్రజల్లో ‘బాడీ పాజిటివిటీ’ గురించి మార్పు రావాలని అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్స్ ‘దీప్తి భర్వాని, పాయల్ సోనీ’ కూడా ఇందుకోసం తమ వంతు ప్రయత్నాన్ని సాగిస్తున్నారు.
దీప్తి భర్వాని
చిన్నప్పటి నుంచి ప్లస్ సైజ్‌లో ఉండటం వల్ల తీవ్రమైన బాడీ ఇమేజ్ సమస్యలతో బాధపడ్డాను. అనుక్షణం అవమానాలు ఎదుర్కొన్నా. 20 ఏళ్లు వచ్చినా, అభద్రతా భావం వెంటాడేది. కానీ ఓ వ్యక్తిని కలిసిన తర్వాత నా ఆలోచనల్లో పూర్తిగా మార్పొచ్చింది. నన్ను నేను యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను. నా ఆలోచనా సరళిని మార్చిన వ్యక్తి ఓ జిమ్ ట్రైనర్. నేను చాలా అందంగా ఉన్నానని, అందంగా కనిపించడానికి బరువు తగ్గాల్సిన పనిలేదని తొలిసారి అతను చెప్పిన మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఇక శిక్షణ సమయంలో నా లక్ష్యాలు భిన్నంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం నా శరీరం పట్ల సంతోషంగా ఉన్నాను. ముంబైలో ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తూ ప్లస్ సైజ్ మోడల్స్‌కు డిజైనర్ వేర్ అందిస్తున్నాను. బాడీ పాజిటివిటీ యాక్టివిస్ట్‌గా ఒబెసిటీతో బాధపడుతున్న వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నాను. చాలామందికి తాము ఎందుకు లావుగా ఉన్నారో తెలియదు. హార్మోన్ సమస్యల ఫలితమా లేదా ఇతరత్రా వైద్య సమస్యలా అన్న విషయం కూడా తెలియదు. నేను క్రియారహితంగా ఉన్నానని, చాలా తింటానని, అసలు ఏ పని చేయనని మాత్రమే ఊహిస్తారు. కానీ ఈ ఆలోచలన్నీ తప్పని అందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది.
పాయల్ సోని
నేను మోడల్ కావాలని ఆశపడ్డాను. కానీ శరీరం అందుకు సరిపోదని, ర్యాంప్‌లో నడవకూడదని నా స్నేహితులే నిరుత్సాహపరిచారు. అయితే అప్పటికీ నాకు సెల్ఫ్ లవ్ అండ్ యాక్సెప్టెన్స్ గురించి తెలియదు. నా స్నేహితులే నన్ను ఫ్యాట్ షేమింగ్ చేస్తున్నారని గ్రహించలేదు. సమాజం లెక్కగట్టి చెబుతున్న అందం నిర్వచనాలను, ప్రమాణాలను వ్యతిరేకించే ఉద్యమం ఒకటుందని కూడా తెలుసుకోలేకపోయాను. కట్ చేస్తే.. ఈ రోజు నేనో ప్లస్ సైజ్ మోడల్. అంతేకాదు లాక్మే ఫ్యాషన్ వీక్ నిర్వహించిన మొదటి ప్లస్ సైజ్ మోడళ్లలో నేను ఒకరిని. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నాకు కూడా ఫాలోయర్స్ ఉన్నారు. ‘ఒలే, ఎనామోర్, షీఇన్, డేనియల్ వెల్లింగ్టన్’ వంటి బ్రాండ్స్‌తో కలిసి పనిచేస్తున్నాను. సమాజం నిర్వచించిన సౌందర్య సాంప్రదాయిక భావనలను విచ్ఛిన్నం చేయడమే నా పని. ఇప్పుడు అనేక పెద్ద బ్రాండ్లు ప్లస్ సైజ్ మోడల్స్‌ను సంప్రదిస్తున్నాయి. మ్యాగజైన్స్ తమ కవర్ పేజీలపై ప్లస్ సైజ్ మోడళ్లను పబ్లిష్ చేస్తున్నాయి. సమాజంలో వచ్చిన మార్పునకు ఇదే నిదర్శనం. కానీ చాలా మందికి ఈ విషయం ఇంకా అర్థం కావడం లేదు. అవగాహన తెచ్చుకోవడం లేదు. ఇండియన్ బ్రాండ్లు ప్లస్ సైజ్‌ను మరింత అర్థం చేసుకోవాల్సి ఉంది. ఉదాహరణకు.. డెనిమ్ షోరూంమ్‌కు వెళ్తే.. 42 సైజ్ జీన్స్ పొందవచ్చు, కానీ 58 సైజు ఊహించలేం. ఇండియాలో చాలా మంది హై ఎండ్ డిజైనర్లు ప్లస్ సైజ్ ఎంపికలను అందించరు.
వీళ్లే కాదు.. తరచూ ఎంతోమంది ప్లస్ సైజ్ వ్యక్తులు అవహేళనకు, బాడీ షేమింగ్‌కు గురవుతున్నారు. వాళ్లంతా తమను తాము యాక్సెప్ట్ చేసుకుని ముందుకు వెళ్లి సగర్వంగా నిలవాలి. జుట్టుకు రంగు, మేనికి మేకప్, కడుపుకు అతుక్కుపోయే నడుము, ఆరుపలకల దేహం, ఒత్తైన జుట్టు, ఆరు అడుగుల పొడుగు ఇవే అందమనే అపోహలో ఇంకా చాలా మంది ఉన్నారు. మనం మనలా ఉండటమే అసలు సిసలైన అందం! అదే ఆనందం. మన ఆత్మగౌరవాన్ని సోషల్ మీడియా మింగేసిన ఈ తరుణంలో ‘బాడీ పాజిటివిటీ’ మరింత అవసరం.