బీజేపీ, టీఆర్ఎస్.. మధ్యలో ఈటల!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చాలా చిత్రంగా మారింది. “ పైకి కత్తులు దూసుకుంటారు.. తెరవెనుకాల మాత్రం దోస్తీ కడతారు.. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నడుస్తున్న ‘అసహజ రాజకీయ సంబంధం’ అంటూ ఇటీవల కాలంలో ఈ రెండు పార్టీల మధ్య ఈ ప్రచారం ఎక్కువైంది. కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న అనేక నిర్ణయాల్ని రాష్ట్ర అధికార పార్టీ వ్యతిరేకిస్తూ వచ్చింది. వ్యవసాయ చట్టాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగితే… టీఆర్ఎస్ నేతలు, […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చాలా చిత్రంగా మారింది. “ పైకి కత్తులు దూసుకుంటారు.. తెరవెనుకాల మాత్రం దోస్తీ కడతారు.. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నడుస్తున్న ‘అసహజ రాజకీయ సంబంధం’ అంటూ ఇటీవల కాలంలో ఈ రెండు పార్టీల మధ్య ఈ ప్రచారం ఎక్కువైంది. కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న అనేక నిర్ణయాల్ని రాష్ట్ర అధికార పార్టీ వ్యతిరేకిస్తూ వచ్చింది.
వ్యవసాయ చట్టాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగితే… టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. కానీ ఆ వెంటనే, కేంద్రానికి మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతేకాదు.. రాష్ట్రంలో కేంద్ర చట్టాలు అమలు చేస్తామంటూ కేసీఆర్ ప్రకటించారు. దీనిపై గులాబీ పార్టీ నేతలు కవరింగ్ ఇస్తున్నా బీజేపీతో స్నేహబంధం బలపడుతూనే ఉంది. తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ కూడా పూర్తి అయింది.
ఈ సందర్భంగా ఈటల ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తారని ఓ చర్చ. ‘తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ముందడుగు వేస్తే, నా పరిస్థితి ఏంటి.’ అన్నదే ఆ ప్రశ్న. ఈటల వంటి సీనియర్ పొలిటీషియన్.. పైగా టీఆర్ఎస్లో కీలక భూమిక పోషించి, మంత్రిగా పనిచేసి, కేబినెట్ నుంచి మెడలుపట్టి బయటకు పంపిన ఈటల… బీజేపీ జాతీయ అధ్యక్షుడి ముందు ఇలాంటి ప్రశ్న ప్రస్తావించారంటే దీనిపై ఆలోచించాల్సిన అంశమే అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్పుతున్నారు.
టీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయకారీగా కొనసాగుతున్న ఒప్పందాల్ని బీజేపీ అధిష్టానం ముందే టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల బహిర్గతం చేసినట్లవుతోంది. వాస్తవానికి కేసీఆర్ రాజకీయ వ్యూహాలు గులాబీ పార్టీలో చాలామంది ముఖ్య నేతలకే అర్థం కావు. వరుసగా రెండు దఫాలు అధికార పీఠం కైవసం చేసుకున్న కేసీఆర్, తన కుర్చీ కిందకి నీళ్ళు వస్తాయని భావిస్తే.. మారు ఆలోచించకుండా బీజేపీకి సాగిలాపడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ ఇటీవల కాలంలో విస్తృతంగా ప్రచారమవుతున్నదే. ఈ విషయాన్నే ఈటల బీజేపీ అధిష్టానం ముందు లేవనెత్తారని రెండు పార్టీల్లో చర్చగా మారింది.
ఎగిసి… చతికిలపడి..!!
దుబ్బాక ఉపఎన్నికల్లో వెయ్యి ఓట్ల తేడాతో దక్కిన విజయం ఓవైపు.. ఆ వెంటనే గ్రేటర్ ఎన్నికల్లో 48 డివిజన్లలో గెలుపు బీజేపీ నేతల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. తెలంగాణలో తమదే ఆధిపత్యం అనే స్థాయికి వెళ్లారు. మన పల్లెల్లో అన్నట్టు… వాపును చూసి బలుపు అనుకున్న బీజేపీ… మండలి ఎన్నికలు ఘోరంగా దెబ్బతీశాయి. అసెంబ్లీలో ఒక్క స్థానాన్ని పెంచుకున్నా… మండలిలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. సిట్టింగ్ స్థానాన్ని సైతం చేజార్చుకుంది. వరంగల్‌లో కనీస పోటీ కూడా ఇవ్వలేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కళ్లు మూసుకుని కమలం గుర్తుకు ఓటేస్తారని, పీవీ కుమార్తె కాదు కదా.. సీఎం కేసీఆర్ నిలబడినా గెలిచేస్తామని ఉర్రూతలూగిన బీజేపీ నేతలకు ఫలితాలు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయి. బీజేపీది బలుపు కాదు వాపు అని ఇతర పక్షాలు విమర్శించడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు గొప్ప అవకాశంగా మారిపోయాయి. నల్లగొండ స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఐదో స్థానంలో ఉన్నారు. అంటే ఆయనను ఓటర్లు అసలు పరిగణనలోకి తీసుకోలేదని తేలింది. ఇక హైదరాబాద్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు కూడా పరాజయం బాట పట్టారు. బీజేపీకి ఎలాంటి హవా లేనప్పుడే గెలిచామని, ఇప్పుడు అంతా బీజేపీమయమని ఎందుకు గెలవమనే ధీమాకు దెబ్బ పడింది.
ఆ తర్వాత సాగర్ సమరం వచ్చింది. అక్కడ కూడా అంతే. గెలుపుకు చాలా దూరంలో నిలిచింది. ఆ తర్వాత మినీ పురపోరులో కూడా చతికిలపడింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో గతంలాంటి బీజేపీగా మారిపోయిందనే ప్రచారాన్ని కాషాయదళం మూటగట్టుకుంది.
టీఆర్ఎస్ను వ్యతిరేకించడంలో విఫలం
ఇక బీజేపీ కొన్నింటిలో విఫలమవుతోంది. టీఆర్ఎస్కు వస్తున్న వ్యతిరేకతను అందుకోవడం లేదు. ఎందుకంటే కేంద్రంతో టీఆర్ఎస్కు దోస్తానా కొనసాగుతోందనేది పలుమార్లు తేలిపోతోంది. టీఆర్ఎస్కూడా వ్యూహాత్మకంగానే ఢిల్లీలో దోస్తీ కడుతూ… ఇక్కడ మాత్రం కుస్తీకే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలది ఒక్కటే బాట అనే ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో బీజేపీ విఫలమవుతోంది.
మరోవైపు దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఒంటరి చేశారు. బీజేపీలోని ఒక వర్గం మొత్తం సంజయ్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతుందనేది పార్టీలోని ప్రచారమే. టీఆర్ఎస్పాలనపై సంజయ్కొంతమేరకు పోరాటం చేసేందుకు ప్రయత్నాలు చేసినా… స్టేట్‌తో పాటు సెంట్రల్ కేడర్ నుంచి కూడా ప్రోత్సాహం లేకుండా పోతోంది. అంతేకాకుండా మండలి ఎన్నికలు, సాగర్ ఎన్నికల్లో నిజంగానే బీజేపీ గెలిస్తే.. సంజయ్‌కు పట్టాపగ్గాలుండవని సొంతపార్టీ నేతలే సహాకరించలేదంటున్నారు.
ఇప్పుడెలా మరి..?
ప్రస్తుతం బీజేపీకి రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులే ముందున్నాయి. ఒక్కరిద్దరు మినహా.. టీఆర్ఎస్, కేసీఆర్‌పై బహిరంగ యుద్ధానికి వెనకాడుతున్నారు. అక్కడ అధిష్టానం నుంచి ఆదేశాలో.. లేకుంటే ఇక్కడా కోవర్టు రాజకీయాలో కానీ టీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నట్టే. మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఏదైనా విమర్శలు చేస్తే.. కేంద్రమే సహాకరించడం లేదనే ఎదురుదాడి కూడా వస్తోంది.
మరోవైపు మొన్నటి వరకూ సంజయ్ వెంట ఉండి మాటల తూటాలు పేల్చిన ఎంపీ అరవింద్ కూడా ఒక్కసారి సైలెంట్ అయ్యారు. దీనికి కారణాలు కూడా లేవు. ఇక ఇప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ… ఆయన అధిష్టానం ముందు పెట్టిన ప్రశ్నలకు సమాధానం లేదని బీజేపీలోని సీనియర్ నేతలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడుతుందా… లేకుంటే గాలి బుడగలా మారి సైలెంట్ అవుతుందా అనేదే తేలాల్సి ఉంది.