కుక్కలు లాక్కెళ్తున్నా.. పట్టించుకోవట్లేదు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కొవిడ్ ఆసుపత్రుల్లో పేరుకుపోతున్న బయో వేస్టేజ్ నిల్వలు వైద్యులు, సిబ్బంది, పేషెంట్లను భయపెడుతున్నాయి. ప్లాస్టిక్ కవర్లలో, డబ్బాల్లో క్లినికల్ యూజ్డ్ ఐటమ్స్ ఆరుబయట పారేయలేకపోవడంతో ఆసుపత్రుల్లో పేరుకుపోతున్నాయి. వేస్టేజీ ద్వారా కూడా కరోనా సోకుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి, భోదన్ జిల్లా ఆసుపత్రి, కామారెడ్డి జిల్లా ఆసుపత్రుల్లో కొవిడ్ బయో వేస్టేజీ నిల్వలు పేరుకుపోతున్నాయి. దీనివల్ల పరిసరాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. క్లినికల్ డంపింగ్ యార్డులకు పంపట్లే.. కరోనా […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కొవిడ్ ఆసుపత్రుల్లో పేరుకుపోతున్న బయో వేస్టేజ్ నిల్వలు వైద్యులు, సిబ్బంది, పేషెంట్లను భయపెడుతున్నాయి. ప్లాస్టిక్ కవర్లలో, డబ్బాల్లో క్లినికల్ యూజ్డ్ ఐటమ్స్ ఆరుబయట పారేయలేకపోవడంతో ఆసుపత్రుల్లో పేరుకుపోతున్నాయి. వేస్టేజీ ద్వారా కూడా కరోనా సోకుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి, భోదన్ జిల్లా ఆసుపత్రి, కామారెడ్డి జిల్లా ఆసుపత్రుల్లో కొవిడ్ బయో వేస్టేజీ నిల్వలు పేరుకుపోతున్నాయి. దీనివల్ల పరిసరాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది.
క్లినికల్ డంపింగ్ యార్డులకు పంపట్లే..
కరోనా బారిన పడిన వారిని చూస్తేనే వైద్యులతో సహా అందరూ బెంబేలెత్తిపోతున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిని గానీ, ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్న వారిని గానీ కన్నెత్తి చూడడానికి కూడా సాహసించడం లేదు. వైరస్ అంటిన వ్యక్తులకు వైద్యం చేయడానికి ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు పేరొందారు. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్ ఆసుపత్రులు వైరస్ నియంత్రించడం సంగతి పక్కన పెడితే.. బయో వేస్టేజీ కారణంగా వైరస్ వ్యాపించే పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ కొవిడ్ ఆసుపత్రిలో 200 బెడ్స్, కామారెడ్డి 50తో వైద్య సేవలను అందిస్తుండగా భోదన్‌లో ప్రస్తుతం పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో కరోనా రోగులతో బెడ్స్ ఫుల్ అయ్యాయి. రోజుకు వంద కిలోల వరకు పైగా బయోవేస్టేజీ ఆసుపత్రుల నుంచి బయటకు వస్తున్నా అవి క్లినికల్ డంపింగ్ యార్డునకు మాత్రం పంపడం లేదు.
కుప్పలు కుప్పలుగా..
వాడిన పీపీఈ కిట్లు, వైద్య సేవలకు ఉపయోగించిన పరికరాలు, గ్లౌజ్‌లు, మాస్క్‌లు, కొవిడ్ ఆసుపత్రిలో గుట్టలుగా పేరుకుపోతున్నాయి. వైద్యం కోసం వాడిన వాటిని చెత్తతో సమానంగా తొలగిస్తున్నారు. వాటిని ప్రత్యేకంగా బయో వెస్టేజీగా గుర్తించి వాటిని రీసైక్లింగ్ సామర్థ్యం కలిగిన కొన్ని సంస్థలకే వాటిని తొలగించే బాధ్యతను అప్పగించాలి. వాటిని సాధారణ చెత్తతో పాటు మున్సిపాలిటీలకు అప్పగించకుండా బయో వేస్టేజీ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు నిల్వ చేస్తున్నారు.
నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలోనే కోవిడ్ విభాగం పక్కన టన్నుల కొద్దీ వేస్టేజీ గుట్టలు పేరుకుపోయాయి. బోధన్ జిల్లా ఆసుపత్రిలోని బయో వెస్టేజీని ఒక గదిలో ఉంచుతుండగా అది నిండిపోయింది. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బయో వెస్టేజీ నిర్వహణను జక్రాన్ పల్లి మండలం పడకల్ లోని ప్రీ మెడికేర్ అనే సంస్థకు అప్పగించారు. వారు జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల బయో వెస్టేజీని తరలిస్తున్నారు. కానీ కొవిడ్ రోగుల కోసం వాడిన వాటిని మాత్రం తరలించడం లేదు. ఎందుకంటే బయో వెస్టేజీకి ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు కాదని వాటిని తొలగించడం లేదు. దాంతో కొవిడ్ రోగుల కోసం అనుమానితులకు వైద్యం చేసిన వారికి పరీక్షలు నిర్వహించిన సామాగ్రిని ఎక్కడికి తరలించాలో తెలియక డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.
కుక్కలు లాక్కెళ్తున్నాయి..
నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలోని బయో వేస్టేజీని వీధి కుక్కలు లాక్కెళ్తున్నాయి. ఇప్పటికే ఆస్పత్రిలోని 8 మంది డాక్టర్లు, 6 మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. భోదన్ జిల్లా ఆస్పత్రిలో ముగ్గురు సిబ్బంది, కామారెడ్డిలో ముగ్గురు సిబ్బందికి వైరస్ సోకింది. అందులో కొందరు పారిశుద్ధ్య సిబ్బందితో పాటు సెక్యురిటీ గార్డు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రత్యేక రేట్ అడుగుతున్నరు: భిక్షపతి, కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్ ఈఈ
ఆసుపత్రుల్లో బయో వేస్టేజ్ తరలించేందుకు ఫ్రీ మెడికేర్ సంస్థకు కాంట్రాక్ట్ ఉంది. వారు ఆసుపత్రిలోని బయో వేస్టేజీని తరలించేందుకు ఒక రేటు, కొవిడ్ బయో వేస్టేజీని తరలించేందుకు ప్రత్యేక రేటును అడుగుతున్నారు. వేస్టేజీ కోసం బెడ్‌కు రూ.5 కోరుతున్నారు. ప్రభుత్వం ధరను నిర్ణయించకపోవడంతో ఆలస్యం అవుతోంది.
వెంటనే తరలించాలి: ఓమయ్య, ఏఐటీయూసీ నాయకుడు
కొవిడ్ ఆసుపత్రుల్లో బయో వేస్టేజీ కారణంగా ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బందితో పాటు రోగులు వారి బంధువుల్లో భయాందోళన నెలకొంది. ఆసుపత్రికి వస్తే ఉన్న రోగాలు తగ్గకపోగా వైరస్‌తో పాటు ఇతర రోగాలు ప్రబలే ప్రమాదం ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం బయోవేస్టేజీని వెంటనే తరలించాలి.