ప్రపంచంలోనే అతిపెద్ద క్లాక్ టవర్.. మళ్లీ మోగనుందా..?
దిశ, ఫీచర్స్ : సెంట్రల్ లండన్‌లో 96 మీటర్ల ఎత్తుతో ఠీవి ఒలకబోస్తూ.. ప్రపంచవ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తున్న గడియార స్తంభం ‘బిగ్‌బెన్’. 1859లో దీని చరిత్ర మొదలవగా, నియో-గోతిక్ శైలిలో ఆర్కిటెక్ట్ అగస్టస్ పుగిన్ ఈ టవర్‌ను రూపొందించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్లాక్ టవర్‌గా పేరుగాంచిన దీనిపై యూకేకు చెందిన ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్ దేశాలను ప్రతిబింబించేలా ఆయా జాతీయ పుష్పాలను డిజైన్ చేయడం విశేషం. బ్రిటిష్ సాంస్కృతిక చిహ్నంగానూ, వరల్డ్ హెరిటేజ్ సైట్‌గానూ ఈ […]
దిశ, ఫీచర్స్ : సెంట్రల్ లండన్‌లో 96 మీటర్ల ఎత్తుతో ఠీవి ఒలకబోస్తూ.. ప్రపంచవ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తున్న గడియార స్తంభం ‘బిగ్‌బెన్’. 1859లో దీని చరిత్ర మొదలవగా, నియో-గోతిక్ శైలిలో ఆర్కిటెక్ట్ అగస్టస్ పుగిన్ ఈ టవర్‌ను రూపొందించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్లాక్ టవర్‌గా పేరుగాంచిన దీనిపై యూకేకు చెందిన ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్ దేశాలను ప్రతిబింబించేలా ఆయా జాతీయ పుష్పాలను డిజైన్ చేయడం విశేషం. బ్రిటిష్ సాంస్కృతిక చిహ్నంగానూ, వరల్డ్ హెరిటేజ్ సైట్‌గానూ ఈ ఐకానిక్ టవర్ పేరుగాంచింది. 2012లో ఎలిజబెత్ 2 డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ‘బిగ్‌బెన్’ టవర్ పేరును ‘ఎలిజబెత్’గా మార్చారు. అయితే ఈ చారిత్రక కట్టడాన్ని సంరక్షించుకునేందుకు 2017లో ‘బిగ్‌బెన్ కన్వర్జేషన్ ప్రాజెక్ట్’ చేపట్టగా, ఆ పనులన్నీ దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ నేపథ్యంలో ఏయే ఫీచర్స్ జతకలిశాయి, ఎలాంటి మార్పులు చేశారో తెలుసుకుందాం.
1834లో వెస్ట్ మినిస్టర్ (యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంటు ఉన్న కాంప్లెక్స్) రాజభవనం ఫైర్ యాక్సిడెంట్‌లో ధ్వంసమైంది. 1844లో పార్లమెంట్ హౌస్ కోసం కొత్త భవనాలు, క్లాక్ టవర్ కలిగి ఉండాలని నిర్ణయించారు. దాంతో ఆర్కిటెక్ట్ చార్లెస్ భారీ డిజైన్ రూపొందించగా, క్లాక్ టవర్ రూపకల్పన కోసం అగస్టస్ వెల్బీ పుగిన్‌ను నియమించాడు. టవర్ నిర్మాణం 1845లో వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్‌లో ప్రారంభమైంది. అయితే అప్పటివరకు సూర్యుడి ద్వారా సమయాన్ని కొలవగా, అది కచ్చితమైన మెజర్‌మెంట్ కాదు. అయితే రాయల్ గ్రీన్‌విచ్ అబ్జర్వేటరీ సమయానికి రోజుకు రెండుసార్లు మ్యాచ్ చేసేలా గడియారం కచ్చితమైన టైమ్ సూచించాలని రాయల్ ఆస్ట్రోనామర్ సర్ జార్జ్ ఎయిరీ కోరుకున్నాడు. దీంతో చాలా మంది క్లాక్ మేకర్స్ ఈ లక్ష్యాన్ని అసాధ్యమని కొట్టిపారేసినప్పటికి, హారాలజీలో నిపుణుడు, సమయాన్ని కొలిచే విజ్ఞానానికి ప్రసిద్ధి చెందిన ఎయిమండ్ బెకెట్ డెనిసన్ సహాయంతో ఎయిరీ దీన్ని సుసాధ్యం చేశాడు. దీనిని నిర్వహించడానికి, నాలుగు చిన్న క్వార్టర్ బెల్స్‌తో ఓ బిగ్‌బెల్‌ను నిర్మించారు. ప్రతి 15 నిమిషాలకు, క్వార్టర్ బెల్ గంటలు వినిపిస్తాయి, ప్రతి గంటకు బిగ్‌బెల్ మోగుతుంది. అది గంట కొట్టేటప్పుడు.. బిగ్ బెన్ ‘E’ నోట్‌ను వినిపిస్తే, టవర్‌లోని నాలుగు చిన్న గంటలు ‘G షార్ప్’, ‘F షార్ప్’, ‘E’ , ‘B’ లను మోగిస్తాయి. 1859, మే31న తొలిసారి ఈ భారీ గంట వెస్ట్ మినిస్టర్‌లో మోగింది. ఇక సాంకేతికంగా.. బిగ్ బెన్ అనేది క్లాక్ టవర్ లోపల ఉన్న భారీ గంటకు పెట్టిన పేరు కాగా, కాలక్రమంలో క్లాక్‌టవర్‌నే ‘బిగ్‌బెన్’ పిలవడం ప్రారంభించారు.
పని చేస్తున్నారా..? లేదా..?
1892లో, టవర్ పైభాగంలో ఐర్టన్ లైట్ ఏర్పాటు చేయగా, ఇది లండన్ అంతటా కనిపిస్తుంది. చీకటి పడిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయనే సంకేతంగానూ ఈ లైట్ ఉపయోగపడేది. ఇది మొదట బకింగ్‌హామ్ ప్యాలెస్ వైపు మాత్రమే కనిపించేదని, ఆ లైట్ వెలుగు ద్వారా విక్టోరియా రాణి (1837-1901) చట్టసభ సభ్యులు పనిచేస్తున్నారో లేదో చూడవచ్చని చెబుతారు.
ఈతరం కోసం..
ఈ ఐకానిక్ భవనంలో అనేక సమస్యలను పరిష్కరించడానికి 1983-1985 మధ్య మరమ్మతులు జరిగాయి. కానీ పరిమిత బడ్జెట్ కారణంగా అసంపూర్ణంగానే పనులు పూర్తిచేశారు. అంతేకాదు గతంలో ఉపయోగించిన కొన్ని పరిరక్షణ పద్ధతులు అంత సురక్షితమైనవి కాకపోవడం, పొల్యూషన్ ఇతర కారణాల వల్ల భవనపరిస్థితి దిగజారుతూనే ఉంది. రాళ్లు శిథిలమైపోగా, టవర్‌కు ఆధారమైన ఇనుము కూడా తుప్పు పట్టింది. పైకప్పులు లీక్ కావడం, పెచ్చులు ఊడిపోవడంతో బిగ్‌బెన్ పూర్వ వైభవం కోసం, టవర్ పునర్నిర్మిస్తున్నట్లు 2017లో ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం 80 మిలియన్ పౌండ్ల($ 111 మిలియన్) కేటాయించింది. ఇందులో భాగంగా రాతి శిల్పాలు, గడియారం డయల్స్ పునరుద్ధరణతో పాటు, సిబ్బందికి, సందర్శకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆరోగ్య, భద్రత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు టవర్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫైర్ సేఫ్టీ వ్యవస్థను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. 334 మెట్లు ఎక్కడం ప్రయాసతో కూడుకున్న విషయం కాబట్టి, లిఫ్ట్‌ను ఇన్‌స్టాల్ చేయనున్నారు. దీంతో అత్యవసర తరలింపులను సురక్షితంగా, వేగంగా చేయవచ్చు. అప్పటి నిర్మాణ నైపుణ్యాన్ని ఈ తరానికి అద్భుతంగా చూపించేందుకు ఒరిజినల్ డిజైన్‌ను తిరిగి తీసుకురావడానికి హెరిటేజ్ ట్రేడ్‌లతో గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీని మిళితం చేసి పునరుద్ధరిస్తున్నారు. టవర్ పైభాగంలో ఉన్న ఐర్టన్ లైట్‌తో సహా ఎల్‌ఈడీ లైటింగ్ అమర్చారు. టవర్ పైభాగంలో ఏర్పాటు చేసిన గ్లాస్ బాక్స్, బిగ్‌బెన్ తో పాటు క్వార్టర్ బెల్స్‌ను చూసేందుకు సందర్శకులకు మెరుగైన వీక్షణతో పాటు, భిన్నమైన అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాదు 21వ శతాబ్దానికి సరిపోయేలా సౌకర్యాలను ఆధునీకరిస్తున్నారు. ఇక వాస్తవానికి నలుపు వర్ణంలో ఉండే క్లాక్ హ్యండ్స్ నీలం రంగులో పెయింట్ చేయడంతో కొత్త సొబగులతో ఆకట్టుకుంటోంది. ఇక నాలుగేళ్లుగా మూగబోయిన బిగ్‌బెన్ టవర్.. 2022లో మళ్లీ మోగనుంది.