లాక్‌డౌన్‌లో భాంగ్రా పాఠాలు.. యూకే పీఎం గుర్తింపు
భారత సంతతికి చెందిన రాజీవ్ గుప్తా అనే ఓ డ్యాన్సర్.. తన భాంగ్రా డ్యాన్స్ పాఠాలతో యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రతి వారం అందించే ‘పాయింట్స్ ఆఫ్ లైట్’ గౌరవాన్ని దక్కించుకున్నారు. లాక్‌డౌన్ కాలంలో సోషల్ మీడియా లైవ్ సెషన్ల ద్వారా ‘భాంగ్రాసైస్’ పేరుతో డ్యాన్స్ ఎక్సర్‌సైజులను రాజీవ్ నేర్పించారు. భాంగ్రా డ్యాన్స్ చేయడం వల్ల మనసు ఉత్తేజితం కావడంతో పాటు శరీరంలోని ప్రతి భాగం కదిలి ఏదో తెలియని శక్తి అందుతుందని, తద్వారా పాజిటివ్ […]
భారత సంతతికి చెందిన రాజీవ్ గుప్తా అనే ఓ డ్యాన్సర్.. తన భాంగ్రా డ్యాన్స్ పాఠాలతో యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రతి వారం అందించే ‘పాయింట్స్ ఆఫ్ లైట్’ గౌరవాన్ని దక్కించుకున్నారు. లాక్‌డౌన్ కాలంలో సోషల్ మీడియా లైవ్ సెషన్ల ద్వారా ‘భాంగ్రాసైస్’ పేరుతో డ్యాన్స్ ఎక్సర్‌సైజులను రాజీవ్ నేర్పించారు. భాంగ్రా డ్యాన్స్ చేయడం వల్ల మనసు ఉత్తేజితం కావడంతో పాటు శరీరంలోని ప్రతి భాగం కదిలి ఏదో తెలియని శక్తి అందుతుందని, తద్వారా పాజిటివ్ వైబ్స్ వస్తాయని రాజీవ్ నమ్మకం. అదే నమ్మకాన్ని లాక్‌డౌన్ సమయంలో అందరిలో మానసిక స్థైర్యాన్ని నింపే ఆయుధంగా మార్చాలన్న ఉద్దేశంతో తాను భాంగ్రాసైస్ ఉచిత పాఠాలను ప్రారంభించినట్లు రాజీవ్ చెబుతున్నారు.
పాయింట్స్ ఆఫ్ లైట్ గౌరవాన్ని అందిస్తూ బోరిస్ జాన్సన్ ఒక లేఖను కూడా రాజీవ్ కోసం రాశారు. అందులో భాంగ్రా డ్యాన్స్‌తో పాటు ఇతర భారతీయ డ్యాన్స్‌ల మీద ఆయనకున్న అభిమానాన్ని బోరిస్ చాటుకున్నారు. గత కొన్ని నెలలుగా దేశంలో భాంగ్రా నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతోందని, శరీరాన్ని కదిలించడం వల్ల చక్కని వ్యాయామం జరిగి ఆరోగ్యం మెరుగుపడుతోందని, అందులో భాగంగా సెషన్లు నిర్వహిస్తున్నందుకు రాజీవ్‌కు బోరిస్ ధన్యవాదాలు తెలిపారు. పదిహేనేళ్లుగా మాంచెస్టర్, బర్మింగ్‌హాం, రీడింగ్‌లలో భాంగ్రాసైజ్ ఫిట్‌నెస్ క్లాసులను నిర్వహిస్తున్న రాజీవ్, 2012 లండన్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలోనూ ప్రదర్శన ఇచ్చారు. తర్వాత ఎంతో ప్రొఫెషనల్ డ్యాన్సర్లకు ఆయన భాంగ్రా నేర్పించారు. ఈ లాక్‌డౌన్‌లో రాజీవ్ పెట్టిన భాంగ్రాసైజ్ వీడియోలకు లక్షల కొద్ది లైవ్ వీక్షణలు వచ్చాయి.