షెడ్యూల్ ఎఫెక్ట్.. దళిత బంధు డబ్బులు పడ్డాయా.. బ్యాంకుల వద్ద క్యూ..
దిశ, హుజురాబాద్/ హుజురాబాద్ రూరల్ : దళిత బంధు స్కీంలో భాగంగా తమ అకౌంట్లలో డబ్బులు పడ్డాయా లేదా అని చూసుకునేందుకు పెద్ద ఎత్తున లబ్ధిదారులు బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికీ డబ్బులు అకౌంట్లలో జమ చేసే ప్రక్రియను జిల్లా యంత్రాంగం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అకౌంట్లలో రూ. 9.90 లక్షలు జమ చేశారా లేదా అనే విషయంపై […]
దిశ, హుజురాబాద్/ హుజురాబాద్ రూరల్ : దళిత బంధు స్కీంలో భాగంగా తమ అకౌంట్లలో డబ్బులు పడ్డాయా లేదా అని చూసుకునేందుకు పెద్ద ఎత్తున లబ్ధిదారులు బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికీ డబ్బులు అకౌంట్లలో జమ చేసే ప్రక్రియను జిల్లా యంత్రాంగం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అకౌంట్లలో రూ. 9.90 లక్షలు జమ చేశారా లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే లబ్ధిదారులు బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. అకౌంట్లు చెక్ చేసుకునేందుకు వచ్చిన వారు క్యూ లైన్లలో నిల్చునే విషయంలో స్వల్ప తోపులాట జరిగింది.
షెడ్యూల్ ఎఫెక్ట్..
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నోటిఫికేషన్ అమలయితే తమకు రావల్సిన డబ్బులు రావేమోనన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. ఈ మేరకు ప్రచారం కూడా జరగడంతో లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్‌లో అమలు చేస్తున్న దళిత బంధు కోసం డబ్బులను కలెక్టర్ అకౌంట్‌కు బదిలీ చేసింది. అయినప్పటికీ తమ చేతికి రాకపోతే ఎలా అన్న ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది. వ్యాపారం చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్నా తన అకౌంట్‌కు డబ్బు రాలేదని ఓ వృద్దురాలు వివరించారు.
అకౌంట్లో డబ్బు జమ అయినట్టు మొబైల్‌కు మెసేజ్ వచ్చి నెల రోజులు కావస్తున్నా నేటికీ ఖాతాలో మాత్రం రూ. 9.90 లక్షలు జమ కాలేదని మరో మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వాహనం కొనుగోలు చేయాలని తాను భావించిన తనకు సర్వే జరిపిన 3 రోజులకే తన అకౌంట్లో డబ్బు జమ అయినట్టుగా మొబైల్‌కు మెసేజ్ వచ్చిందని జూపాకకు చెందిన రాజు వివరించారు. అయితే నేడు హెల్ప్ డెస్క్ వద్దకు వచ్చి ఆరా తీస్తే డబ్బులు జమ కాలేదని చెప్పారన్నారు. తన కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరిందని మరోకరి అకౌంట్లో డబ్బు జమ కాలేదని మరొకరు వివరించారు.