మ్యూటేషన్ పెండింగ్.. తస్మాత్ జాగ్రత్త?
దిశ, తెలంగాణ బ్యూరో: భూమిని కొనుగోలు చేస్తున్నారా? అయితే రికార్డులన్నీ సరి చూసుకోవాలి. పట్టాదారుడికి డబ్బులన్నీ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోదు. సేల్ డీడ్ డాక్యుమెంట్ కాపీ, లింకు డాక్యుమెంట్లు ఉన్నాయని సంతోషపడితే కుదరదు. మీ ఆస్తికి వేరే వారసులు వస్తారు.. మీకు విక్రయించినవారే మరోసారి ఇతరులకు అమ్మే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త.. మ్యూటేషన్లకు నోచుకోని డాక్యుమెంట్లు లక్షలలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు దరఖాస్తు చేసుకున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెండింగులో పడ్డాయి. ధరణి పోర్టల్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: భూమిని కొనుగోలు చేస్తున్నారా? అయితే రికార్డులన్నీ సరి చూసుకోవాలి. పట్టాదారుడికి డబ్బులన్నీ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోదు. సేల్ డీడ్ డాక్యుమెంట్ కాపీ, లింకు డాక్యుమెంట్లు ఉన్నాయని సంతోషపడితే కుదరదు. మీ ఆస్తికి వేరే వారసులు వస్తారు.. మీకు విక్రయించినవారే మరోసారి ఇతరులకు అమ్మే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త..
మ్యూటేషన్లకు నోచుకోని డాక్యుమెంట్లు లక్షలలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు దరఖాస్తు చేసుకున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెండింగులో పడ్డాయి. ధరణి పోర్టల్ అమలు కావడంతో అపరిష్కృతంగానే మిగిలాయి. భూములు విక్రయించినవారి పేరిటే కొనసాగుతున్నాయి. మరోసారి అమ్మేసేందుకు ధరణి సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. సేల్ డీడ్ ద్వారా విక్రయించినా ఆ విషయాన్ని పసిగట్టే వ్యవస్థ పోర్టల్కు లేదు. పక్కాగా మ్యూటేషన్ చేసి కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట ఆ సర్వే నంబరు, విస్తీర్ణాన్ని నమోదు చేయడమే పరిష్కారం.
పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తే తప్ప మరో మార్గమేదీ లేదు. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో ధరణి పోర్టల్ ఆధారంగా విక్రయించిన భూమిని మరోసారి అమ్మేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. డేటాలో వాళ్ల పేర్లే వస్తుండడంతో అమ్మగలిగారు. అక్రమాలను అడ్డుకునే మార్గమేదీ తహసీల్దార్ల దగ్గర లేదని స్పష్టమైంది. డిజిటల్ సంతకాలను పెండింగులో పెట్టిన దరఖాస్తులకు యుద్ధప్రాతిపదికన మోక్షం కలిగించకపోతే ప్రమాదమే. మ్యూటేషన్ కు దరఖాస్తు చేసుకోని కొనుగోలుదారులకు మరింత ప్రమాదం పొంచి ఉన్నదనేలా రంగారెడ్డి జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమిని మళ్లీ వేరే వాళ్లకు అమ్మేశారంటూ బాధితులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు.
మళ్లీ రిజిస్ట్రేషన్
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారంలో రెండు ఎకరాల భూమిని హైదరాబాద్ గుడిమల్కాపూర్ కు చెందిన పూజ మహేశ్వర్ 2018 నవంబరు 22న కొనుగోలు చేశారు. పట్టాదారుడికి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తలకొండపల్లి మండలం అంతారంకు చెందిన బాగం గోపాల్ దగ్గర కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్ చూపిస్తోంది. కొనుగోలుదారుడి సేల్ డీడ్ తెచ్చుకొని ఇంట్లో భద్రం చేసుకున్నారు. మ్యుటేషన్ కు తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకోలేదు. దాంతో రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారుడిగా అమ్మిన వ్యక్తి కొనసాగుతున్నారు.
కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం సదరు భూమిని విక్రయించినట్లుగా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ స్పష్టం చేస్తుంది. ఐనా.. ఏం జరిగిందో తెలియదు? ఏ యే అధికారి సహకరించారో అంతుచిక్కడం లేదు? కానీ అదే పట్టాదారుడు మరోసారి సదరు భూమిని విక్రయించారు. ఈ సారి హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన ముక్కర సుధాకర్ కు అమ్మేశారు. 2019 ఏప్రిల్ 22న సేల్ డీడ్ డాక్యుమెంట్ నంబరు 10896 ద్వారా అమ్మినట్లు స్పష్టమైంది. ఒకటే భూమిని సబ్ రిజిస్ట్రార్ రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు బాధితుడు పూజ మహేశ్వర్ ఆరోపించారు. ఈ మేరకు తలకొండపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఏడాదిగా పెండింగ్
రాష్ట్ర వ్యాప్తంగా మ్యూటేషన్ ఫైళ్లను పెండింగులో ఉంచారు. సర్క్యులర్లు జారీ చేసి డిజిటల్ సంతకాలు చేయకుండా పెండింగ్ పెట్టిన కారణంగా పాస్ పుస్తకాలు అందుకోనివారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అన్ని పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ కొందరు తహసీల్దార్లు మెలికలు పెడుతున్నారు.
పెండింగ్ ఫైళ్లను కలెక్టర్ల లాగిన్ లోకి పంపకుండా దాటవేతన ధోరణిని అవలంభిస్తున్నారు. డిజిటల్ సంతకం పెండింగ్ అంటే.. వెబ్ పోర్టల్ లో ఫైళ్లు ఉన్నట్లే. మళ్లీ పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. ఆ విషయం చెప్పకుండా కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నారు. గట్టిగా నిలదీస్తే మరోసారి దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ లాగిన్ లోకి పంపుతామంటున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ దరఖాస్తులు ప్రశ్నిస్తున్నారు. రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన భూములకు హక్కులు దక్కడం లేదని వాపోతున్నారు.