హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే బీసీ బంధు అమలు చేయాలి
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఎన్నికల కంటే ముందే నిర్దిష్ట కాలవ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంధు అమలుచేయాలని బీసీ ఉద్యమనేత ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా, త్వరలోనే బీసీ బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం బీసీలను మోసం చేసేందుకేనని అయన విమర్శించారు. ఆదివారం కాచిగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ బంధు వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8 న రాష్ట్రవ్యాప్తంగా […]
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఎన్నికల కంటే ముందే నిర్దిష్ట కాలవ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంధు అమలుచేయాలని బీసీ ఉద్యమనేత ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా, త్వరలోనే బీసీ బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం బీసీలను మోసం చేసేందుకేనని అయన విమర్శించారు. ఆదివారం కాచిగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ బంధు వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8 న రాష్ట్రవ్యాప్తంగా బీసీ సమరశంఖారావం పేరుతో కలెక్టర్, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడి చేపట్టాలని పిలుపునిచ్చారు. బీసీ వ్యతిరేక విధానాలని విడనాడకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ ప్రధానితో భేటీ సందర్భంగా బీసీ సమస్యలు చేర్చికపోవడం దారుణమన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి బిల్లు పెట్టకపోతే దేశంలో అగ్గిరాజుకుంటుందని, బీసీ సమస్యల పరిష్కారానికి కేసీఆర్ చొరవ తీసుకోని ప్రధాని మోడీ దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. బీసీ ఐఏఎస్‌లంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిన్నచూపు ఉందని, సమర్ధవంతమైన బీసీ ఐఏఎస్‌లకు ప్రాధాన్యతలేని పోస్టింగ్‌లు ఇస్తూ కీలకమైన నాలుగు శాఖలను సీఎస్ దగ్గరే పెట్టుకోవడం దారుణమని, ఆఖరికి అటెండర్ కూడా ఆయనే అయ్యేట్లు ఉన్నారని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందే సీఎం కేసీఆర్‌కు నోటిఫికేషన్లు గుర్తుకు వస్తాయని, నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం మొద్దునిద్ర వహిస్తుందని విమర్శించారు. బీసీలకు సంపూర్ణ ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని కోరారు.
బీసీలపై పక్ష పాత వైఖరీని విడనాడాలని, లేకుంటే ఉగ్రవాదులుగా తయారవుతున్నారన్నారు. విద్యా ఉద్యోగ అవకాశాలతోపాటు రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలను బిచ్చగాళ్లుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాన్ని విడనాడాలన్నారు. రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రకటించి భర్తీ చేయాలన్నారు. నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని మండిపడ్డారు. బీసీ ఐఏఎస్ లకు కీలక శాఖల బాధ్యతలు అప్పగించాలని కోరారు. బీసీలపై పక్షపాత వైఖరి మానుకోకపోతే ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు.
సీఎం పేషీలో బీసీ ఐఏఎస్‌కు స్థానం కల్పించాలని, 50 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రేషలైజేషన్ పేరుతో స్కూల్‌లను బందుపెట్టి ఆస్తులను అమ్ముకునే కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు. బడుల ఆస్తులను అమ్ముతుంటే గ్రామాల ప్రజలు తరమికొడతారన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను చూసి కేసీఆర్ ఎంతో నేర్చుకోవాలని సూచించారు. సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశం, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ సంఘం కార్యదర్శి రాజు, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, నాయకులు సత్యనారాయణ, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.