మాజీ సీఎం మృతి.. బండి పాదయాత్ర మళ్ళీ వాయిదా
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మళ్లీ వాయిదా పడింది. తిరిగి ఈ నెల 28వ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభం కానున్నది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తెలంగాణ ఇన్‌చార్జీ తరుణ్‌చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, బీజేపి శాసనసభా […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మళ్లీ వాయిదా పడింది. తిరిగి ఈ నెల 28వ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభం కానున్నది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తెలంగాణ ఇన్‌చార్జీ తరుణ్‌చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, బీజేపి శాసనసభా పక్ష నాయకులు రాజా సింగ్ తదితర పలువురు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను చేయాల్సిందిగా ఆ ప్రాంతాల్లోని పార్టీ నేతలకు రాష్ట్ర కార్యాలయం నుంచి సమాచారం వెళ్ళింది.
బండి సంజయ్ తన పాదయాత్రను తొలుత ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభించాలనుకున్నారు. కానీ పార్లమెంటు సమావేశాలు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర తదితరాలతో ఆగస్టు 24కు వాయిదా పడింది. కానీ ఇంతలోనే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ అకాల మృతితో మరోసారి వాయిదా పడింది. ఆయన మృతి సూచకంగా బీజేపీ ఆరు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. సంతాపదినాల్లో పాదయాత్రను ప్రారంభించరాదన్నది పార్టీ ఆనవాయితీ. దీంతో తిరిగి ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా వేయాల్సి వచ్చింది. తిరిగి ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న అంశంపై నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో సమావేశంలో చర్చించి ఈ నెల 28వ తేదీ అనే నిర్ణయం జరిగింది.
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న ఈ యాత్రకు రెండు సార్లు ఆటంకాలు ఎదురుకావడం పార్టీ రాష్ట్ర శ్రేణులను నిరుత్సాహానికి గురిచేసింది. భారీ స్థాయిలో పాదయాత్రను నిర్వహించాలన్న ఉద్దేశంతో 30 కమిటీలను రాష్ట్ర నాయకత్వం నియమించింది. ఆ ప్రకారం పాదయాత్ర మంగళవారం నుంచి మొదలవుతుండడంతో దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసింది. పార్టీ శ్రేణులు కూడా భారీ స్థాయిలోనే ఖర్చు చేశారు. ఇప్పుడు అర్ధాంతరంగా వాయిదా పడడంతో డబ్బు వృథా కావడంతో పాటు కార్యకర్తలు నిరుత్సాహంలో పడ్డారు. సంతాపదినాల కారణంగా మాజీ సైనికోద్యోగులు బీజేపీలో చేరే కార్యక్రమం కూడా వాయిదా పడినట్లు పార్టీ కార్యాలయం పేర్కొన్నది.