కేసీఆర్ మరో మాస్టర్ ప్లాన్.. ఈటల అనుచరుడికి కీలక పదవి

దిశ‌, హుజురాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ముఖ్య అనుచరుడికి ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ బొనాంజ ప్రకటించారు. ఈటలను కాదని పార్టీలోనే కొనసాగుతున్న బండ శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు పథకాల అమలు విషయంలోనే హుజురాబాద్‌కు పెద్దపీట వేసిన కేసీఆర్ నామినేటెడ్ పదవుల పందేరంలో కూడా ఇక్కడికే ప్రాధాన్యత కల్పిస్తుండటం విశేషం. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బండ శ్రీనివాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు […]

Update: 2021-07-23 07:25 GMT

దిశ‌, హుజురాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ముఖ్య అనుచరుడికి ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ బొనాంజ ప్రకటించారు. ఈటలను కాదని పార్టీలోనే కొనసాగుతున్న బండ శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు పథకాల అమలు విషయంలోనే హుజురాబాద్‌కు పెద్దపీట వేసిన కేసీఆర్ నామినేటెడ్ పదవుల పందేరంలో కూడా ఇక్కడికే ప్రాధాన్యత కల్పిస్తుండటం విశేషం.

రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బండ శ్రీనివాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌‌లో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్.. విద్యార్ధి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. ఎన్ఎస్‌యూఐలో మొదట పని చేసిన శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలోనూ పలు బాధ్యతల్లో పనిచేశారు. హాకీ ప్లేయర్ కూడ అయిన శ్రీనివాస్ హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడిగా, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, టెలికాం బోర్డు జిల్లా మెంబర్‌గా కూడా పని చేశారు. హుజురాబాద్ టౌన్ ఎంపీటీసీగా రెండు సార్లు ఎన్నికైన ఆయన.. మొదట కెప్టెన్ ఫ్యామిలీతో సన్నిహితంగా మెదిలారు. ఆ తరువాత ఈటల రాజేందర్‌తో కలిసి పని చేశారు. ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన తరువాత హుజురాబాద్‌కు వచ్చినప్పుడు టీఆర్ఎస్‌లోనే కొనసాగాలని సూచించారు. ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌ను కలిసి సీఎం కేసీఆర్‌ను ఒప్పిస్తామని ఈటలకు చెప్పారు.

చివరకు ఈటల టీఆర్ఎస్‌కు రాజీనామా చేయడం, బీజేపీలో చేరిపోవడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలోనే ఉండిపోయారు. 2001లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన శ్రీనివాస్ పార్టీలో వివిధ పదవుల్లో కూడా కొనసాగారు. తాజాగా ఆయనకు ఎస్సీ కార్పోరేషన్ పదవిని కట్టబెట్టడంతో ఉద్యమ ప్రస్థానం ఆరంభంలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు అధినేత కేసీఆర్ సుముఖంగా ఉన్నారన్న సంకేతాలను కూడా పంపించనున్నారు.

Tags:    

Similar News