షూటింగ్‌ల్లేవ్, అన్నీ షౌటింగ్‌లే..
టాలీవుడ్‌లో ఒక్కసారిగా విబేధాలు భగ్గుమన్నాయి. కరోనా లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన సినీ ఇండస్ట్రీని ఓ కొలిక్కి తేవడానికి మెగాస్టార్ చిరంజీవి అహర్నిశలు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో సరికొత్త వివాదం మొదలైంది. దీంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారి భగ్గుమన్నాయి. అసలు ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో తెలియని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే మరోసారి బాలయ్య వర్సెస్ చిరంజీవిగా పరిస్థితులు మారిపోయాయి. […]
టాలీవుడ్‌లో ఒక్కసారిగా విబేధాలు భగ్గుమన్నాయి. కరోనా లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన సినీ ఇండస్ట్రీని ఓ కొలిక్కి తేవడానికి మెగాస్టార్ చిరంజీవి అహర్నిశలు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో సరికొత్త వివాదం మొదలైంది. దీంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారి భగ్గుమన్నాయి. అసలు ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో తెలియని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే మరోసారి బాలయ్య వర్సెస్ చిరంజీవిగా పరిస్థితులు మారిపోయాయి. కరోనా కారణంగా వాయిదాపడిన సినిమాల షూటింగ్ ప్రారంభించేందుకు చిరు ఇంట్లో సినీ పెద్దలు చర్చలు జరపడం.. అదే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జరిపిన చర్చల గురించి తనకెవ్వరూ సమాచారం ఇవ్వలేదన్నారు. ఇప్పటి వరకూ సినీ పెద్దలు జరిపిన సమావేశాని.. సీఎంతో జరిపిన ఏ సమావేశానికి తనను ఏ ఒక్కరూ కూడా పిలవలేదని బాలయ్య తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి..!?
అంతటితో ఆగని ఆయన.. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కూర్చుని భూములు పంచుకుంటున్నారా? అని షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం. మీటింగ్‌లు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వాస్తవానికి బాలయ్య లాంటి సీనియర్ హీరోకు చిన్నపాటి సమాచారం కూడా ఇవ్వకుండా చర్చలు జరుపడం.. దానిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం.. తీవ్ర ఆరోపణలు చేయడం వెనుక ఆంతర్యమేంటి..? బాలయ్య చెప్పాల్సింది చెప్పకుండా ఏదో కొరతతో ఇలా అన్నాడని టాలీవుడ్‌లో పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాదు.. బాలయ్య చేసిన భూములు, రియల్‌స్టేట్ ఆరోపణలు నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరికొందరు పెద్దలు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్కే అవుతోంది. ఈ వ్యవహారం కాస్త పలు మలుపులు తిరిగే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఫేస్ వాల్యూ ఇంపార్టెంట్..
బాలయ్య వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత సి కల్యాణ్ స్పందించారు. సినిమా ఇండస్ట్రీకి మేలు జరగడమే మాకు కావాలి తప్పా.. ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు? అనేది విషయం కాదన్నారు. ఇంతవరకూ దివంగత దాసరి నారాయణ రావు టాలీవుడ్ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారి పనులు చక్కబెట్టే వారన్న విషయాన్ని గుర్తు చేస్తూనే.. అదే స్థానాన్ని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి భర్తీ చేస్తున్నారన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు.. చిరు ఇంట్లో భేటీతో పాటు సీఎంతో సమావేశం ఈ విషయాలన్నింటినీ బాలయ్య దృష్టికి తీసుకెళ్లానని నిర్మాత తెలిపారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. అవసరముంటే చెప్పండి తాను కూడా వస్తానన్న విషయాన్ని కూడా మీడియా ముఖంగా కుండ బద్ధలు కొట్టారు. అంతటితో ఆగని సి కల్యాణ్.. ఇక్కడ ఫేస్ వాల్యూ అనేది ఇంపార్టెంట్ అని.. ఎవరితో పని జరిగితే వారిని తీసుకువెళ్తామని చెప్పడం టాలీవుడ్‌లో విబేధాలపై మరింత అగ్గిరాజేసినట్లు అయ్యింది.
అటు తలసాని.. ఇటు ‘మా’..!
ఓ వైపు బాలయ్యకు కౌంటరిచ్చే ప్రయత్నం చేస్తూనే అబ్బే.. టాలీవుడ్‌లో తమకు ఎలాంటి విబేధాల్లేవని కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. బాలయ్యకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. చిరు ఇంట్లో జరిగిన భేటీకి మంత్రి తలసాని బాధ్యత వహించారని.. ఇక సీఎంతో భేటీ విషయమై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషనే పిలుచుకోవాలని ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని అంటే అటు తలసాని.. ఇటు ‘మా’పై వేసేసి సి. కల్యాణ్ మాత్రం తిన్నగా చేతులు దులుపేసుకున్నారు. మొత్తానికి చూస్తే.. టాలీవుడ్‌లో పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ వివాదం మున్ముంధు ఇంకా పెరుగుతుందే తప్ప అస్సలు తగ్గే పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపించట్లేదు.
బాలకృష్ణ నువ్వు కింగ్ కాదు..
బాలకృష్ణ నువ్వు ఇండస్ట్రీకి కింగ్ కాదు.. ఇండస్ట్రీలో ఒకడివి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నారు నాగబాబు. సినీ కార్మికుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని సినిమా షూటింగ్ లు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఇండస్ట్రీ పెద్దలను భూములు పంచుకుంటున్నారు అని ఆరోపించడం ముమ్మాటికీ తప్పే అన్నారు. ఈ వ్యాఖ్యలతో మీరు సినీ ఇండస్ట్రీని మాత్రమే కాదు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అవమానపరిచారన్నారు. వెంటనే ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.