సాగర్ బైపోల్.. బీజేపీ రేసులో డాక్టర్ రవినాయక్..?

దిశ ప్రతినిధి, నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల తుది ఎంపికపై దృష్టి సారించాయి. ఎంపిక చేసే అభ్యర్థిని సామాజిక వర్గాల ప్రాతిపదికనే కాకుండా ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తిని ఎంపిక చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. అందులో భాగంగానే బీజేపీ నుంచి నాగార్జునసాగర్ ఉపఎన్నిక అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవినాయక్ పేరు రేసులోకి వచ్చింది. ఇప్పటివరకు నాగార్జునసాగర్ ఉపఎన్నిక టికెట్ […]

Update: 2021-03-06 09:02 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల తుది ఎంపికపై దృష్టి సారించాయి. ఎంపిక చేసే అభ్యర్థిని సామాజిక వర్గాల ప్రాతిపదికనే కాకుండా ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తిని ఎంపిక చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. అందులో భాగంగానే బీజేపీ నుంచి నాగార్జునసాగర్ ఉపఎన్నిక అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవినాయక్ పేరు రేసులోకి వచ్చింది. ఇప్పటివరకు నాగార్జునసాగర్ ఉపఎన్నిక టికెట్ కోసం కంకణాల నివేదితారెడ్డి, కడారి అంజయ్యయాదవ్ పేర్లు విన్పించాయి. కానీ ఇటీవల బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో డాక్టర్ రవినాయక్ పార్టీలో చేరారు. ఎస్టీ సామాజిక వర్గంలో గుర్తింపు పొందిన నాయకుడిగానే కాకుండా విద్యావేత్త, వైద్యుడు కావడం.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం వల్ల ఆయన పేరు ప్రధాన జాబితాలోకి చేరినట్టు సమాచారం.

గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్..

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గిరిజనులు అధికంగా ఉండటంతో ఈసారి గిరిజనులకే టికెట్ కేటాయించాలని ఇక్కడి గిరిజనులు బీజేపీ అధిష్టానానికి విన్నవించారు. సాగర్ నియోజకవర్గంలో గిరిజనులు దాదాపు 42 వేల ఓటర్లు ఉంటారని అంచనా. దీంతో అధిక శాతం ఓటర్లు కలిగిన గిరిజనులకు ఏ పార్టీ తగిన ప్రాధాన్యత కల్పించడం లేదనే భావన గిరిజనుల్లో ఇప్పటివరకు బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలో విద్యావంతుడు, సామాజిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అవగాహన కల్పిస్తున్న ప్రముఖ వైద్యుడు పానుగోతు రవినాయక్ బీజేపీ లో చేరడం.. ఇటు పార్టీకి అటు గిరిజనులకు కొంతమేర ఉత్సాహాన్ని కలిగించింది. సాగర్ ఉపఎన్నికలో గిరిజనులే కీలక ఓటర్లుగా మారడంతో కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్‌లు గిరిజన ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నానా యాగి చేస్తున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్‌లో పని చేసిన రవినాయక్ ప్రస్తుతం బీజేపీలో చేరడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. 1988 అంటే నాటి చలకుర్తి నియోజకవర్గం ఉన్నప్పుడు దివంగత నాయకుడు రాగ్యానాయక్ మాత్రమే గిరిజన నేతగా బరిలో నిలిచారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కూడా గిరిజనులను ఓటు బ్యాంకుగా మలుచుకున్నారే తప్ప ఏ రాజకీయ పార్టీలు గిరిజనులకు టికెట్ ఇవ్వకపోవడం గమనార్హం. 2011 జనాభా ప్రాతిపదికన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అధికంగా ఉన్న గిరిజనులను దృష్టిలో పెట్టుకొని త్వరలో సాగర్ నియోజకవర్గంలో జరిగే ఉపఎన్నికల్లో గిరిజనులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఇదే జరిగితే డాక్టర్ రవినాయక్‌కు బీజేపీ పార్టీ నుంచి టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News