‘బాబ్రీ’ నిందితులకు.. మందిరం నిర్మాణ బాధ్యతలు

బాబ్రీ మసీదు స్థల వివాదస్పదంపై గతేడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రామమందిర నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును మోడీ సర్కారు ఏర్పాటు చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత చట్ట ఉల్లంఘనేనని ప్రకటిస్తూనే.. ఆ స్థలంలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. అలాగే, మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించాలనీ ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుపై కొందరు సామాజిక కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మసీదు […]

Update: 2020-02-21 07:22 GMT

బాబ్రీ మసీదు స్థల వివాదస్పదంపై గతేడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రామమందిర నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును మోడీ సర్కారు ఏర్పాటు చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత చట్ట ఉల్లంఘనేనని ప్రకటిస్తూనే.. ఆ స్థలంలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. అలాగే, మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించాలనీ ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుపై కొందరు సామాజిక కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మసీదు కూల్చివేతను తప్పుపడుతూనే.. మందిర నిర్మాణానికి అనుమతినివ్వడాన్ని ప్రశ్నించారు. అంతిమంగా బాబ్రీ మసీదు కూల్చివేసినవారే విజయం సాధించినట్టయిందని విశ్లేషణలు చేశారు.

ఈ వారం ఈ ఆరోపణ మరోసారి తెరమీదకు వచ్చింది. దీనికి.. రామ మందిర నిర్మాణ ట్రస్టు ఉన్నత స్థానాల్లోకి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులోని ఇద్దరు నిందితులకు చోటు లభించడమే కారణం. విశ్వహిందు పరిషత్ నేతలు నృత్య గోపాల్ దాస్, చంపత్ రాయ్‌లను రామ జన్మ భూమి తీర్థ క్షేత ట్రస్టుకు అధ్యక్ష కార్యదర్శులుగా ఎనుకున్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వీరిరువురూ నిందితులుగా ఉన్నారు.

ట్రస్టులో వీరిద్దరి చేర్పు అనూహ్యంగా జరిగింది. ఇటీవలే సర్కారు ఈ ట్రస్టు ఏర్పాటు చేసింది. కానీ, అధ్యక్ష కార్యదర్శుల స్థానాలను ఖాళీగా ఉంచింది. ఈ నెల 5న ట్రస్టు సభ్యుల పేర్లు బయటకు వచ్చినప్పుడు మహంత్ నృత్యగోపాల్ దాస్, చంపత్ రాయ్ పేర్లు లేకపోవడంపై రామ జన్మభూమి న్యాస్ సీనియర్ సభ్యుడు మహంత్ కమల్ నయన్ దాస్ ఆగ్రహానికి లోనైనట్టు తెలిసింది. ఈ విషయాన్నే నేరుగా కేంద్ర హోం శాఖ ముందుకు తీసుకెళ్లినట్టు సమాచారం. అంతేకాదు, వారిరువురి పేర్లు ట్రస్టులో ఉంటాయని హోం శాఖ నుంచి హామీని పొందామని కమల్ నయన్ దాస్ ఓ పత్రికకు తెలిపారు. అయితే, ప్రభుత్వం నేరుగా వారిని ఏర్పాటు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఏర్పడవచ్చన్న కారణంతో వారిని నియమించలేదని హోం శాఖ వివరణ ఇచ్చినట్టు ఆయన చెప్పారు. ఇటీవలే వారిరువురుని ట్రస్టు అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో బాబ్రీ మసీదు కూల్చినోళ్లే ఇప్పుడు మందిర నిర్మాణం బాధ్యతలు తీసుకున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు ఆరోపణలు చేస్తున్నారు.

Tags:    

Similar News