ఇలా ‘బ్లాక్’ కు చెక్..!
దిశ ప్రతినిధి, మేడ్చల్ : ఒకవైపు కరోనా వణికిస్తుంటే.. మరోవైపు ‘బ్లాక్ ఫంగస్’ (మ్యుకర్ మైకోసిస్) అనే వ్యాధి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే మన రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. నగరంలోని కోఠి ఈఎన్‌టీ, గాంధీ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు బాధితుల తాకిడి పెరిగింది. ఈ తరుణంలో అసలు బ్లాక్ ఫంగస్ ఎవరికి సోకుతుంది.? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.? తదితర అంశాలపై ‘దిశ’ అందిస్తున్న […]
దిశ ప్రతినిధి, మేడ్చల్ : ఒకవైపు కరోనా వణికిస్తుంటే.. మరోవైపు ‘బ్లాక్ ఫంగస్’ (మ్యుకర్ మైకోసిస్) అనే వ్యాధి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే మన రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. నగరంలోని కోఠి ఈఎన్‌టీ, గాంధీ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు బాధితుల తాకిడి పెరిగింది. ఈ తరుణంలో అసలు బ్లాక్ ఫంగస్ ఎవరికి సోకుతుంది.? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.? తదితర అంశాలపై ‘దిశ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
బ్లాక్ ఫంగస్ వ్యాప్తి ఇలా..
బ్లాక్ ఫంగస్ అనేది వైరస్ కాదు. అలాగే అంటువ్యాధి కూడా కాదు. ఇది కొంతమందికి మాత్రమే వచ్చే వ్యాధి. ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నవారికీ, కరోనా తగ్గి ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య వస్తోంది. కొవిడ్ చికిత్స సమయంలో అధికంగా స్టెరాయిడ్ వాడటం, ఆక్సిజన్ అందించేప్పుడు పరికరాలు పరిశుభ్రంగా లేకపోవడం కూడా ఈ వ్యాధికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆక్సిజన్ అందించే ప్రక్రియలో ఉపయోగించే హ్యుమిడిఫయర్‌లో స్టెరైల్ వాటర్‌కు బదులు సాధారణ నీటిని ఉపయోగించడం వలన ఫంగస్ ఏర్పడుతోంది.
లక్షణాలు ఇవీ..
కంటి కింద నొప్పి, ముఖంలో ఒకపక్క వాపు, తలనొప్పి, జ్వరం, ముక్కు దిబ్బడ, పాక్షికంగా దృష్టి లోపం.. ఇవి ప్రారంభంలో కన్పించే లక్షణాలు. ఇన్ఫెక్షన్ ముదిరితే.. కంటి చుట్టూ ఉండే కండరాలను స్తంభింపజేసి.. అంధత్వం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇన్ఫెక్షన్ మెదడుకు పాకితే మెనింజైటిస్ (మజ్జ రోగం)కు దారితీస్తుందని నిపుణుల హెచ్చరిస్తున్నారు. ప్రారంభదశలోనే బ్లాక్ ఫంగస్ ను గుర్తించకుంటే ప్రాణాపాయానికి దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు.
రిస్క్ ఎవరికి..?
అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్, కిడ్నీ వ్యాధులు, సైనస్, హెచ్ఐవీ, గుండె జబ్బులు కలవారిలో దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. క్యాన్సర్ చికిత్స, కిడ్నీ, లివర్ మార్పిడి జరిగిన వారు.. మోకాళ్ల నొప్పులు, ఆస్మా ఉన్నవారు స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతుంటారు. అందుకే వారిలో కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. ఇది సాధారణంగా ముక్కు నుంచి కంటికి, అక్కడి నుంచి మెదడుకు వ్యాప్తి చెందుతుంది. అలాగే దవడ, చర్మం, ఊపిరి తిత్తులకు కూడా సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు…
- షుగర్ లెవెల్ పరగడుపున 125, భోజనం చేశాక 250 ఉండేలా చూసుకోండి.
- డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి.
- స్టెరాయిడ్లు ఇష్టమొచ్చినట్లు కాకుండా జాగ్రత్తగా వాడాలి.
- బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే… వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
- డైట్‌లో పౌష్టికాహారం, పీచు పదార్ధాలు, సిట్రస్ జాతి పండ్లు ఉండేలా చూసుకోండి.
- గుడ్డులోని తెల్ల భాగాన్ని తినాలి.
- ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నవారు.. కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
- కరోనా నుంచి రికవరీ అయ్యి డయాబెటిస్ ఉన్న వారు… డిశ్చార్జి అయ్యాక షుగర్ లెవెల్స్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
- కరోనా సోకి ట్రీట్‌మెంట్ తీసుకునేటప్పుడు ముక్కు రంధ్రాలు మూసుకుపోతే… అది బ్లాక్ ఫంగస్ వల్ల కూడా కావచ్చని అనుకోవాలి.
- వెంటనే ట్రీట్‌మెంట్ అందించడం ద్వారా రోగిని బతికించవచ్చు.
- ఇది సోకితే… శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింత తగ్గిపోతుంది.
హోమియో తో చెక్..
బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు ఆయూష్ వైద్య విధానంలో చికిత్స ఉంది. హోమియోపతిలో వ్యాధి నివారణకు మందులున్నాయి. కొవిడ్ నుంచి కొలుకుంటున్న వారు, బ్లాక్ ఫంగస్ రాకుండా హోమియో మందులు వాడుచ్చు. మధుమేహం నియంత్రణ లేనివారు. అధికంగా స్టెరాయిడ్ వినియోగించిన వారు హోమియో మందులను వాడి బ్లాక్ ఫంగస్ ను నివారించవచ్చని ఆమె వెల్లడించారు. ఆర్సెనిక్-ఏఎల్‌బీ 200 (Arsenic-Alb 200) మెడిసిన్ తోపాటు ఫైవ్ పీహెచ్ఓఎస్ 6 ఎక్స్ (FIVE PHOS 6X) టాబ్లెట్లతోపాటు తదితర మందులు వాడొచ్చని, క్వాలిఫైడ్ హోమియోపతి ఫిజీషియన్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలని సూచించారు.
-డాక్టర్ అలగు వర్షిణి, ఆయూష్ డైరెక్టర్
రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు
ఆయుర్వేద మందులతో బ్లాక్‌ఫంగస్ ను నివారించవచ్చు. కొవిడ్, నాన్ కొవిడ్ బాధితులకు బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తొంది. మూడు వారాలకు మించి స్టెరాయిడ్ వినియోగిస్తే ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ అదేశానుసారం. ఆయూష్ వైద్య నిపుణులతో ప్రత్యేక సమావేశం జరిగింది. బ్లాక్ ఫంగస్ నివారణకు ఆయుర్వేద మూలికలను వాడాలని నిర్ణయించారు. రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు ఉన్న శక్తిని తగ్గుకుండా మందులను వాడచ్చు. ఎస్ఆర్ నగర్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీలో బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేపట్టాం. కరోనా చికిత్స సమయంలో ఎక్కువగా స్టెరాయిడ్లు వాడుతున్న వారిలో బ్లాక్ ఫంగస్ వస్తుంది. ఈ క్రమంలో ఆయుర్వేద ఆయూష్ విభాగం ఆధ్వర్యంలో వ్యాధి నివారణ కొరకు ఉచిత మందులు ఇస్తున్నాం. వీటిని క్రమం తప్పకుండా వాడినట్లయితే బ్లాక్ ఫంగస్ను ముందుగానే నివారించవచ్చు. కొవిడ్ వచ్చిన వారిలో కూడా రాకుండా అరికట్టవచ్చు. ఈ మందులను ప్రతిరోజు స్థానిక ఆయుర్వేద హాస్పిటల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత పంపిణీ చేస్తున్నాం.
-డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు, ప్రిన్సిపల్, ఆయుర్వేదిక ప్రభుత్వ కళాశాల