Ayodhya Ram Mandir : రాముడి దర్శనానికి వెళ్తున్నారా.. ఇవి తెలుసుకోండి
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది.
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తొలిరోజు కేవలం ముఖ్య అతిథులు, వీవీఐపీలకు మాత్రమే స్వామివారి దర్శనభాగ్యం లభించింది. ఇక మంగళవారం నుంచి సామాన్య భక్తులు కూడా అయోధ్య రామయ్యను దర్శించుకోవచ్చు. దీంతో చాలామంది భక్తజనం రామజన్మభూమి దర్శనానికి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. అలాంటి వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన సమాచారం వివరాలివీ..
దర్శనం, హారతి వేళలు
అయోధ్య రామమందిరాన్ని భక్తులు రోజూ ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రెండు విడతల్లో దర్శించుకోవచ్చు. రోజూ ఉదయం 6:30 గంటలకు జాగరణ్/శృంగార్ హారతి, రాత్రి 7:30 గంటలకు సంధ్యా హారతిని నిర్వహిస్తారు.
పాస్‌లు పొందడం ఇలా..
హారతి లేదా దర్శనం కోసం ప్రజలు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్గాల్లో పాస్‌లను బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అయోధ్య రామ మందిరం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇందులో లాగిన్ చేయడానికి మొబైల్ నంబర్‌ను వాడాలి. ఫోన్ నంబరును ఎంటర్ చేశాక.. ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఆధారంగా భక్తులు తమ గుర్తింపును ధ్రువీకరించాలి. అనంతరం ‘మై ప్రొఫైల్’ సెక్షన్‌ను క్లిక్ చేయాలి. అందులో మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. హారతి (ఆర్తి), దర్శనం అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో మీరు కోరుకున్నది ఎంచుకోండి. అనంతరం మీ గురించి అడిగే వివరాలను ఎంటర్ చేయాలి. బుకింగ్ ప్రాసెస్ పూర్తయ్యే క్రమంలో.. చివరగా ‘కన్ఫార్మ్’ అనే ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది. దాన్ని తప్పకుండా ఓకే చేయాలి. బుకింగ్ జరిగిన వెంటనే బుకింగ్ స్లాట్ వివరాలన్నీ ఫోన్ నంబరుకు మెసేజ్ రూపంలో అందుతాయి. ఆన్‌లైన్ బుకింగ్ ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంది. ఈ సర్వీసును అతి త్వరలోనే యాక్టివేట్ చేయనున్నారు. బుకింగ్స్ చేసుకున్నవారు ఆలయం వద్దకు చేరుకున్నాక.. తమ ఫోన్‌కు వచ్చిన బుకింగ్ నంబరును కౌంటర్‌లో చూపించి దర్శనం/హారతి పాస్‌ను తప్పకుండా తీసుకోవాలి.
ఆఫ్‌లైన్‌లోనూ పాస్
అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర్ ట్రస్టు క్యాంపు కార్యాలయానికి నేరుగా వెళ్లి ఐడీ ప్రూఫ్‌లను సబ్మిట్ చేసి ఆఫ్‌లైన్‌లోనూ పాస్‌లను పొందొచ్చు. అయితే ఆఫ్‌లైన్ బుకింగ్‌లో.. క్యూలైన్‌లో ముందు వరుసలో ఉన్నవారికి పాస్‌ల మంజూరులో తొలి ప్రాధాన్యత ఇస్తారు. హారతి కార్యక్రమం కోసం స్లాట్‌ను బుక్ చేసుకున్న భక్తులు.. నిర్ణీత సమయం కంటే కనీసం అరగంట ముందే క్యూ లైన్‌లో నిలబడి పాస్‌పై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి లోపలికి ప్రవేశించాలి. ఇక అయోధ్యా నగరంలోని ఇతర టూరిజం ప్లేస్‌లు, చారిత్రక ఆలయాలను సందర్శించేందుకు భక్తులకు లోకల్‌గా ఆటో రిక్షాలు, సైకిల్ రిక్షాలు అందుబాటులో ఉంటాయి.