ఇలా జరుగుతుందని ముందే తెలుసు: రామాలయం, మోడీపై అద్వానీ కీలక వ్యాఖ్యలు
నేనంటే ఎవరో తెలియనివారు కూడా మారుమూల గ్రామాల నుంచి వచ్చి రథాన్ని చూసి భావోద్వేగానికి లోనవుతూ నా దగ్గరకు వచ్చేవారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఏదో ఒకరోజు ఉత్తర ప్రదేశ్‌లో అయోధ్య రామమందిరం నిర్మితమవ్వాలనేది విధి నిర్ణయమని, ఈ ప్రక్రియలో తాను రథసారథిని మాత్రమేనని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో కీలక పాత్ర పోషించిన అద్వానీ.. ఈ నెల 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట వేడుకకు హాజరుకానున్నట్టు ‘విశ్వ హిందూ పరిషత్’(వీహెచ్‌పీ) తాజాగా స్పష్టం చేసింది. అవసరమైతే ఆయన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది. ఈ క్రమంలోనే ‘రాష్ట్రధర్మ’ అనే ఓ మ్యాగజైన్‌తో అద్వానీ తాజాగా మాట్లాడారు. ‘‘1990లో నేను రథయాత్ర ప్రారంభించిన కొన్నిరోజులకే ఇదంతా విధి నిర్ణయమని అనుకున్నాను. అయోధ్యలో ఏదో ఒక రోజు రామమందిరం నిర్మితమవుతుందని ఆనాడే అర్థమైంది. ఈ ప్రక్రియలో నేను రథసారథిని అని తెలుసుకున్నాను. గుజరాత్ నుంచి రథ యాత్ర ప్రారంభించినప్పుడు దేశవ్యాప్తంగా అదొక ఉద్యమ రూపం దాలుస్తుందని అనుకోలేదు. యాత్రలో నా జీవితాన్ని ప్రభావితం చేసిన అనేక అనుభవాలున్నాయి. నేనంటే ఎవరో తెలియనివారు కూడా మారుమూల గ్రామాల నుంచి వచ్చి రథాన్ని చూసి భావోద్వేగానికి లోనవుతూ నా దగ్గరకు వచ్చేవారు. సెల్యూట్ చేసి, రామ జపం చేసి వెళ్లిపోయేవారు. అయోధ్యలో రామమందిరం అనేక మంది కల అని అప్పుడే అర్థమైంది. ఇప్పుడు, ప్రధాని మోడీ దేశంలోని ప్రతి పౌరుడికీ ప్రాతినిధ్యం వహిస్తూ ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు’’ అని అద్వానీ వెల్లడించారు. రాముడు తన ఆలయాన్ని పునరుద్ధరించడానికి ఎంచుకున్న భక్తుడే మోడీ అని.. అభివర్ణించిన అద్వానీ.. ఈ సందర్భంగా ప్రధానికి అభినందనలు తెలిపారు. కాగా, 1990 సెప్టెంబరు 25న గుజరాత్‌లోని సోమనాథ్‌లో ప్రారంభమైన వివాదాస్పద ‘రథయాత్ర’కు బీజేపీలోని మరో సీనియర్ నేత మురళి మనోహర్ జోషీతో కలిసి అద్వానీ నాయకత్వం వహించారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతతో ఈ రథయాత్ర ముగిసింది. ఈ ఘటనతో ఉత్తరభారతంలో మతహింస చెలరేగింది. ఇదిలా ఉండగా, అయోధ్య రామాలయాన్ని ఈ 22న ప్రధాని మోడీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పూర్తిగా నిర్మితం కాకుండానే ఆలయాన్ని ప్రారంభిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.