ఒక్కరోజే 5 లక్షల మంది.. అయోధ్యకు పోటెత్తిన భక్తులు
దిశ, నేషనల్ బ్యూరో : రామ్‌లల్లా దర్శనం కోసం అయోధ్య రామమందిరానికి తొలిరోజైన మంగళవారం దాదాపు 5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు తరలివచ్చారు.
దిశ, నేషనల్ బ్యూరో : రామ్‌లల్లా దర్శనం కోసం అయోధ్య రామమందిరానికి తొలిరోజైన మంగళవారం దాదాపు 5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయం ఆధ్మాత్మిక సందడిని సంతరించుకుంది. రామాలయ ప్రాంగణమంతా రామనామ స్మరణతో మార్మోగింది. భక్తులకు సాఫీగా శ్రీరామ దర్శనం కల్పించేందుకు 8వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని ఆలయ ప్రాంగణంలో మోహరించారు. ఉత్తరప్రదేశ్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్,ప్రత్యేక డీజీ ప్రశాంత్ కుమార్ రామమందిరంలో పరిస్థితిని పర్యవేక్షించారు. ఎస్‌ఎస్‌పీ అయోధ్య, అయోధ్య డివిజనల్ కమిషనర్, ఇతర సీనియర్ అధికారులంతా భద్రతా విధుల్లో పాల్గొన్నారు. రామాలయం గేట్ల ఎదుట భక్తజనం కిక్కిరిసి నిలబడిన వీడియోలు మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భక్తజనాన్ని పోలీసులు, భద్రతా సిబ్బంది నియంత్రించలేకపోతున్న సీన్‌లు అందులో కనిపించాయి. తీవ్ర రద్దీ కారణంగా చాలామంది భక్తులు సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చిందని మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో రద్దీ క్రమబద్ధీకరణకు చేపడుతున్న చర్యలపై పోలీసు ఉన్నతాధికారులతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమీక్షించారు. అనంతరం ఆయన స్వయంగా ఏరియల్ సర్వే నిర్వహించి ఆలయంలో భక్తుల రద్దీని పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘రామభక్తులు దర్శనం కోసం తొందరపడొద్దు. రామ్‌లల్లా ఇక శాశ్వతంగా తన జన్మస్థలంలో ఉంటారు. ఆయన వనవాసం ఇక ముగిసింది. దర్శనం కోసం అయోధ్యకు వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం. భక్తులంతా అయోధ్యలో రద్దీపై ముందస్తుగా సమాచారం తెలుసుకొని ఓపికతో అయోధ్యకు రండి’’ అని ఆయన కోరారు.