ఒక్క జీబీ డేటా.. దేశానికో ధర!
ఈరోజుల్లో ఇంటర్నెట్ లేకపోతే బయటి ప్రపంచంతో అనుబంధం లేనట్లే! ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉన్నారు. ఒకప్పుడు ఇంటర్నెట్ లేకుండా ఎలా జీవించారనే ఆశ్చర్యం కూడా కొన్నిసార్లు కలుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. ‘మానవ శరీరంలో మొబైల్ ఒక భాగం అయితే, ఇంటర్నెట్ అనేది అందులో ప్రవహించే రక్తం’ అని చెప్పవచ్చు. స్మార్ట్‌ఫోన్ విషయంలో దీన్ని ‘డేటా’ అని సంబోధించాలి. ఆ డేటా ఊరికే రాదు కదా.. డబ్బులు పెట్టి రీచార్జి చేసుకోవాలి. ప్రపంచమంతా […]
ఈరోజుల్లో ఇంటర్నెట్ లేకపోతే బయటి ప్రపంచంతో అనుబంధం లేనట్లే! ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉన్నారు. ఒకప్పుడు ఇంటర్నెట్ లేకుండా ఎలా జీవించారనే ఆశ్చర్యం కూడా కొన్నిసార్లు కలుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. ‘మానవ శరీరంలో మొబైల్ ఒక భాగం అయితే, ఇంటర్నెట్ అనేది అందులో ప్రవహించే రక్తం’ అని చెప్పవచ్చు. స్మార్ట్‌ఫోన్ విషయంలో దీన్ని ‘డేటా’ అని సంబోధించాలి. ఆ డేటా ఊరికే రాదు కదా.. డబ్బులు పెట్టి రీచార్జి చేసుకోవాలి. ప్రపంచమంతా ఉన్న ఇంటర్నెట్ ఒకే విధంగా పనిచేస్తున్నప్పటికీ 1 జీబీ మొబైల్ డేటాకు అయ్యే ఖర్చులో మాత్రం చాలా తేడా ఉంది. ఆ తేడా ఎంతలా ఉందంటే.. అతి తక్కువ ఖర్చుకు 1 జీబీ డేటా అందించే దేశానికి, అతి ఎక్కువ ఖర్చుకు అందించే దేశానికి మధ్య 30000 శాతం తేడా ఉందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కేబుల్.కో.యూకే( cable.co.uk) వారు 1 జీబీ డేటాకు అవుతున్న సగటు ధర పేరుతో 155 దేశాల డేటాను విడుదల చేశారు. ఈ డేటాను పరిశీలిస్తే ఆ తేడా అర్థమవుతుంది.
మొదటిస్థానంలో మనమే
భారతదేశంలో జియో ఎంట్రీ ఇచ్చాక ఇంటర్నెట్ వాడకం తీరే మారిపోయింది. ఒకప్పుడు నెలకు 1 జీబీ డేటా వస్తే.. దాన్ని చాలా పొదుపుగా వాడుకుంటూ సరిగ్గా 30 రోజులకు ఉపయోగించుకునేవారు. కానీ జియో వచ్చాక రోజుకు 2 జీబీల డేటా కూడా సరిపోవడం లేదు. ఇక కరోనా పుణ్యమాని వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైన దగ్గరినుంచి రోజుకు 5 నుంచి 10 జీబీల డేటాను భారత ప్రజలు వినియోగిస్తున్నారు. అయితే ప్రపంచంలో 1 జీబీ డేటా అతి తక్కువ ధరకు దొరికే దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 1 జీబీ డేటాకు సగటున రూ. 6.73 ఖర్చు అవుతోంది. తర్వాతి స్థానాల్లో ఇజ్రాయెల్ (రూ. 8.23), కిర్గిస్థాన్ (రూ. 15.71), ఇటలీ (రూ. 32.18), ఉక్రెయిన్ (రూ. 34.42) దేశాలు ఉన్నాయి.
ఖరీదైన దేశాలివే
తక్కువ మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు ఉండటంతో మార్కెట్‌లో పోటీ ఉండదు. కాబట్టి వారు ఏ ధరకు అందిస్తే అదే ధరకు డేటాను కొనాల్సి ఉంటుంది. అలాగే తక్కువ మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు, అందులో లేని అవస్థాపనా సౌకర్యాల కారణంగా కొన్ని దేశాల్లో 1 జీబీ ఇంటర్నెట్ డేటా సగటు ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో ‘మాలావీ’ దేశం మొదటి స్థానంలో ఉంది. అక్కడ 1 జీబీ డేటాకు సగటున రూ. 2051 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇక తర్వాతి స్థానాల్లో బెనిన్ (రూ. 2036), ఛాడ్ (రూ. 1745.80), యెమెన్ (రూ. 1195), బోట్స్‌వానా (రూ. 1037 ) దేశాలు ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో 8 డాలర్లు. అంటే రూ. 598.64 అన్నమాట.
ఎందుకిలా?
ఇలా 1 జీబీ డేటాకు అయ్యే సగటు ఖర్చు భారీ తేడా ఉండటం గురించి పరిశోధకులు బాగా పరిశోధించి కొన్ని కారణాలతో జాబితా చేశారు. వాటిలో ప్రధానంగా మూడు కారణాలను వారు వివరించారు. మొదటిది అవస్థాపనా సౌకర్యాలు. మొబైల్ డేటా బాగా పనిచేయాలంటే ముందు సిగ్నల్ కావాలి. సిగ్నల్ కోసం టవర్‌లు కావాలి. భారత్, ఇటలీ లాంటి దేశాల్లో ఈ అవస్థాపనా సౌకర్యాలు సమృద్ధిగా ఉండటంతో తక్కువ ధర సాధ్యమవుతోంది. రెండోది కంపెనీల మధ్య పోటీతత్వం. మొబైల్ డేటాను వాడుకునే వాళ్లు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్‌గా సర్వీస్ ప్రొవైడర్లు పెరుగుతారు. అప్పుడే పోటీతత్వం పెరిగి డేటా ధరలు తగ్గుతాయి. మూడోది వినియోగదారుని సగటు ఆదాయం. ఎక్కువ ఆదాయం ఉన్న వినియోగదారుడు మొబైల్ డేటాను ఎక్కువ వినియోగించగలుగుతాడు. దానికి కావాల్సినంత చెల్లించగలుగుతాడు. అందుకే అవసరాన్ని బట్టి డేటాను వినియోగించుకునే దేశాల్లో కూడా ఎక్కువ ధర ఉందని విశ్లేషకులు వెల్లడించారు.