ఎజెండా లేని అసెంబ్లీ సెషన్

దిశ, తెలంగాణ బ్యూరో: చరిత్రలోనే తొలిసారిగా ఎలాంటి ఎజెండా, ప్లానింగ్ లేని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లాంఛనంగా ఈ నెల 24న ప్రారంభమైన సెషన్ తొలి రోజున సంతాప తీర్మానాలతోనే సరిపోయింది. మొత్తం ఏడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నట్లు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) ఖరారు చేసింది. కానీ ఏ రోజు ఏ అంశంమీద చర్చ జరుగుతుందో, ప్రభుత్వం తరపున ఏయే బిల్లులను ఎప్పుడు ప్రవేశపెడతారో, స్వల్పకాలిక చర్చలకు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అంశాలేంటో.. ఇవేవీ ఖరారు […]

Update: 2021-09-26 19:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: చరిత్రలోనే తొలిసారిగా ఎలాంటి ఎజెండా, ప్లానింగ్ లేని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లాంఛనంగా ఈ నెల 24న ప్రారంభమైన సెషన్ తొలి రోజున సంతాప తీర్మానాలతోనే సరిపోయింది. మొత్తం ఏడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నట్లు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) ఖరారు చేసింది. కానీ ఏ రోజు ఏ అంశంమీద చర్చ జరుగుతుందో, ప్రభుత్వం తరపున ఏయే బిల్లులను ఎప్పుడు ప్రవేశపెడతారో, స్వల్పకాలిక చర్చలకు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అంశాలేంటో.. ఇవేవీ ఖరారు కాలేదు. అన్ని పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమావేశాలపై స్పష్టమైన నిర్ణయం జరగాల్సిన బీఏసీ సమావేశం ఏం ఖరారు చేసిందో అధికారికంగా వెల్లడికాలేదు.

అధికార, విపక్ష సభ్యుల పరస్పర అంగీకారంతో ఖరారు కావాల్సిన అసెంబ్లీ సెషన్ నిర్దిష్టంగా ఎప్పటివరకు జరుగుతుందో కూడా ఇంకా తేలలేదు. ప్రస్తుతానికి అక్టోబరు 5వ తేదీ వరకు జరుగుతుందని, ఆ తర్వాత కొనసాగింపుపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని మాత్రమే అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి ఎజెండా లేకుండా జరుగుతున్నఅసెంబ్లీ సమావేశాలుగా ఈసారి సెషన్‌ చరిత్రలో నిలిచిపోనున్నది. సభా కార్యకలాపాలను ఏ విధంగా నిర్వహించాలనే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోడానికే బీఏసీ సమావేశం జరుగుతుంది. ప్రతీ అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఇది రెగ్యులర్‌గా జరిగే ప్రక్రియే. సభా నియమాలకు లోబడి ఈ సమావేశంలో షెడ్యూలు రూపొందుతుంది.

కానీ, ఈ సారి మాత్రం ఆ సంప్రదాయం అటకెక్కింది. ప్రతిపక్షాలు సైతం దీనిపై పెద్దగా పట్టింపు లేకుండానే వ్యవహరిస్తున్నాయి. మజ్లిస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అయినప్పటికీ అధికార పార్టీకి ఆచరణలో మిత్రపక్షంగానే కొనసాగుతున్నది. ఇక కాంగ్రెస్ శాసనసభా పక్షం లాంఛనంగా టీఆర్ఎస్‌లో విలీనమైపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండడంతో బీఏసీ సమావేశానికి మల్లు భట్టివిక్రమార్క హాజరయ్యారు. కనీసం ఇరవై రోజుల పాటు సభా సమావేశాలు కొనసాగాల్సిందిగా ఈ సమావేశంలో డిమాండ్ చేసినట్లు మీడియాకు తెలిపారు. కానీ చివరకు ఏడు పనిదినాల పాటు సభను నడపాలని నిర్ణయం జరిగినా రోజువారీ షెడ్యూలు, ప్లానింగ్ మాత్రం లేకుండా పోయింది.

నిర్దిష్టంగా ప్రభుత్వం ఈ సెషన్‌లో ఏమేం అంశాలను సభ దృష్టికి తీసుకురానున్నదో, వాటిపై ఏ రోజున ఎంత సేపు చర్చ జరపాలనుకుంటున్నదో, విపక్షాల నుంచి వచ్చే ప్రతిపాదనలపై చర్చించడానికి ఎంత సమయాన్ని కేటాయించాలనుకుంటున్నదో.. ఇలాంటి విషయాలపై బీఏసీ చర్చించాల్సి ఉన్నా చివరకు అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం మౌనంగానే ఉండిపోయింది. ఇద్దరు సభ్యులున్న బీజేపీకి బీఏసీ సమావేశానికి ఆహ్వానమే అందలేదు. సభా సంప్రదాయాన్ని నిర్లక్ష్యం చేసినందుకు నిరసనగా అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర నల్ల చొక్కాలు ధరించి అసంతృప్తిని వ్యక్తం చేయనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు.

సభా సమావేశాలను విపక్ష సభ్యుల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించాలంటూ బీఏసీ సమావేశంలో స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ప్రోటోకాల్ నియమ నిబంధనలను పాటిస్తూ అసెంబ్లీ కార్యకలాపాలను దేశానికి ఆదర్శవంతంగా నిర్వహించాలని, గొప్ప సాంప్రదాయాలు నెలకొల్పడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో స్పీకర్ ఆలోచన చేయాలంటూ ముఖ్యమంత్రి ఈ సమావేశంలో వ్యాఖ్యానించారు. సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టాల్సిన బిల్లులను సభ్యులకు ముందస్తుగానే పంపించాలని, ప్రోటోకాల్‌ను తు.చ. తప్పకుండా పాటించేలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని కూడా సీఎం సూచించారు. కానీ ఆ సూచనలకు భిన్నంగా, బీఏసీ సమావేశంలో చర్చించిన స్ఫూర్తికి విరుద్ధంగా ఆచరణ ఉండడం గమనార్హం.

ఒకవైపు సభా సంప్రదాయాలు, నియమాలు తు.చ. తప్పకుండా అమలుకావాలని, ఆదర్శవంతంగా ఉండాలని సీఎం చెప్తూ ఉండగానే ఎజెండా, ప్లానింగ్ లేకుండా ఏడు రోజుల సెషన్ మొదలవుతుండడం గమనార్హం. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలకు వేదికగా అసెంబ్లీ సమావేశాలు ఉండతాలని, కుస్తీ పోటీలకు వేదికగా మారరాదంటూ సీఎం చెప్తున్నా ఏ రోజు సభలో ఏ బిజినెస్ జరుగుతుందో సభ్యులకే తెలియని అనిశ్చితి, గందరగోళ పరిస్థితి నెలకొనడం చరిత్రలో ఇదే తొలిసారి.

Tags:    

Similar News