ఆసియా కప్ మళ్లీ వాయిదా.. పాక్ ఫైర్?
దిశ, స్పోర్ట్స్: ఆసియా కప్ 2021 షెడ్యూల్ మేరకు జూన్‌లో జరగాల్సి ఉన్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను ఈ ఏడాదికి వాయిదా వేశారు. శ్రీలంక వేదికగా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌లో ఇండియాతో పాటు ఇతర ఆసియా జట్లు తలపడనున్నాయి. అయితే జూన్‌లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ జరుగనున్నాయి. టీమ్ ఇండియా కనుక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరితే మరోసారి ఆసియా కప్ వాయిదా […]
దిశ, స్పోర్ట్స్: ఆసియా కప్ 2021 షెడ్యూల్ మేరకు జూన్‌లో జరగాల్సి ఉన్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను ఈ ఏడాదికి వాయిదా వేశారు. శ్రీలంక వేదికగా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌లో ఇండియాతో పాటు ఇతర ఆసియా జట్లు తలపడనున్నాయి. అయితే జూన్‌లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ జరుగనున్నాయి. టీమ్ ఇండియా కనుక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరితే మరోసారి ఆసియా కప్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మార్చి 4 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో ఇండియా విజయం సాధించినా., డ్రా చేసుకున్న డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరనున్నది. అలా కాకుండా ఇంగ్లాండ్ జట్టు విజయం సాధిస్తే ఆస్ట్రేలియా ఫైనల్స్‌కు చేరుకుంటుంది కాబట్టి ఆసియా కప్‌కు ఎలాంటి ఆటంకం ఉండబోదు.
ఈ ఏడాది జరగకపోతే రద్దే?
ఆసియా కప్ ఈ ఏడాది జూన్‌లో గనుక నిర్వహించకపోతే మొత్తానికి రద్దు చేసే అవకాశాలు ఉన్నదయి. ఆసియా కప్ కోసం అనుకూలమైన షెడ్యూల్ లేకపోవడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నది. ఈ ఏడాది జూన్ తర్వాత ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో ఖాళీ లేకుండా పోయింది. కరోనా కారణంగా గత ఏడాది అంతా ఎఫ్‌టీపీ గందరగోళంగా మారింది. దీంతో కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లను వాయిదా వేశారు. అంతే కాకుండా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాదితో పాటు 2022లో కూడా నిర్వహించనున్నారు. 2023లో వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరుగనున్నది. దీంతో ఆసియా కప్‌ను 2023లో జరిగే వన్డే వరల్డ్ కప్ తర్వాత నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా నేతృత్వంలో త్వరలో సమావేశం జరుగనున్నది. ఆ సమావేశంలో ఆసియా కప్‌పై తుది నిర్ణయం తీసుకున్నారు.
పాకిస్తాన్ బోర్డు అక్కసు..
ఆసియా కప్‌ను షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్నది. అయితే పాకిస్తాన్‌లో జరిగితే టీమ్ ఇండియా అక్కడ ఆడే అవకాశం లేదు. దీంతో ఆతిథ్య హక్కులను శ్రీలంక క్రికెట్ బోర్డుకు బదలాయించింది. కనీసం లంకలో అయినా ఆసియా కప్ జరుగుతుందని భావించిన పీసీబీకి ఇప్పుడు డబ్ల్యూటీసీ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆసియా కప్ చివరి సారిగా 2016లో బంగ్లాదేశ్‌లో నిర్వహించారు. 2018లో జరగాల్సిన ఆసియా కప్.. ఇండో-పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో రద్దు చేశారు. ఇక 2020లో జరగాల్సిన ఆసియా కప్ కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కారణంగా ఆసియా కప్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉండటంతో పీసీబీ మండి పడుతున్నది. ప్రతీ సారి బీసీసీఐ కారణంగానే ఆసియా కప్ వాయిదా పడుతున్నదని.. టీమ్ ఇండియా లేకుండా ఆసియా కప్ నిర్వహించాలని పట్టుబడుతున్నది. కాగా, టీమ్ ఇండియా లేకుండా ఆసియా కప్ నిర్వహిస్తే.. ప్రేక్షకుల ఆదరణ ఉండదని ఏసీసీ భావిస్తున్నది. శ్రీలంక బోర్డు కూడా టీమ్ ఇండియా లేకుండా ఆసియా కప్ నిర్వహణకు విముఖత చూపిస్తున్నది. దీంతో అందరూ ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగే నాలుగో టెస్టు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.