తిరిగొచ్చేటోళ్లకు కరోనా పరీక్షలు
దిశ, న్యూస్ బ్యూరో: వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపేందుకు కేంద్రం అనుమతినివ్వడంతో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ నుంచి వలస వెళ్లిన వారు తిరిగి రావడం ప్రారంభమైంది. ఈ వలసల్లో కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లినవారితో పాటు పర్యాటకులు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వస్తున్న వారిని రెండు రకాలుగా వర్గీకరించినట్లు తెలుస్తోంది. వైరస్ ప్రభావం అంతగా లేని ప్రాంతాల నుంచి వచ్చేవారు, తీవ్రంగా ఉన్న ప్రదేశాల నుంచి వచ్చేవారిగా విభజించారు. ఇప్పటికే ఇతర […]
దిశ, న్యూస్ బ్యూరో: వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపేందుకు కేంద్రం అనుమతినివ్వడంతో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ నుంచి వలస వెళ్లిన వారు తిరిగి రావడం ప్రారంభమైంది. ఈ వలసల్లో కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లినవారితో పాటు పర్యాటకులు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వస్తున్న వారిని రెండు రకాలుగా వర్గీకరించినట్లు తెలుస్తోంది. వైరస్ ప్రభావం అంతగా లేని ప్రాంతాల నుంచి వచ్చేవారు, తీవ్రంగా ఉన్న ప్రదేశాల నుంచి వచ్చేవారిగా విభజించారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలసల వివరాలను తమకు ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ సాధారణ పరిపాలన శాఖను కోరింది. ఎంతమంది వస్తారో తెలిస్తే అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటామని తెలిపింది. దీంతో వలసలపై సర్కారు లెక్కలు తీసే పనిలో పడింది.
సరిహద్దుల వద్ద స్క్రీనింగ్..
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి రాష్ట్ర సరిహద్దుల వద్దే స్క్రీనింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే వారందరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సర్కారు నిర్ణయించింది. లేకపోతే వారి వల్ల ఇక్కడ చాలా మంది కరోనాతో ఎఫెక్ట్ అయ్యే ప్రమాదముందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం చాలా జిల్లాల్లో గత 14 రోజులుగా కేసుల్లేవు. ఇప్పుడు రాష్ట్రంలోకి వచ్చే వలసలతో కొత్త కేసులు పెరిగితే మొదటికే మోసం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వైరస్‌ను సరిహద్దుల వద్దే కట్టడి చేయాలని భావిస్తోంది. గురువారం ముంబై నుంచి యాద్రాద్రి జిల్లాకు వస్తున్న వలస కార్మికులను ఇలాగే గుర్తించి పరీక్షించగా అందులో ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. శుక్రవారం కోల్‌కతా నుంచి వచ్చిన 74 మందికి కూడా సరిహద్దుల వద్దే స్క్రీనింగ్ చేశారు. వారిలో ఎవ్వరికీ అనుమానిత లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్ ముద్ర వేసి ఇళ్లకు పంపారు. 28 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు వారికి సూచించారు. ఇంటి వద్దే సౌకర్యం ఉంటే హోం క్వారంటైన్‌లో ఉంచుతారు. డబ్బులు ఖర్చుపెట్టుకోగలిగిన వారిని హోటళ్లకు పంపుతారు. ఒకవేళ ఇళ్లు, డబ్బులు రెండూ లేకపోతే వారిని సర్కారీ క్వారంటైన్ కేంద్రాలకు పంపుతామని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమంది వస్తారన్న దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. రెండ్రోజుల్లో ఎంతమందనేది వివరాలందుతాయనీ, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
Tags: corona, lockdown, reverse migration, telangana government, test, quarantine