గ్రేటర్ అభ్యర్థులకు ఖర్చులు ఖరారు
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికలకు వడివడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులను నియమించి రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) మార్గదర్శకాలను జారీ చేసింది. రాజకీయ పక్షాలకు కూడా హ్యాండ్ బుక్‌లెట్లను పంపిణీ చేసింది. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తి చేసేందుకు సహకరించాలని సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థులకు రూ.5 లక్షల వరకు ప్రచార పరిమితిని విధించారు. కార్పొరేషన్ల వార్డులకు పోటీచేసే అభ్యర్థులు రూ.1.50 లక్షలు ఖర్చు చేసుకోవాలని సూచించారు. ప్రచార […]
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికలకు వడివడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులను నియమించి రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) మార్గదర్శకాలను జారీ చేసింది. రాజకీయ పక్షాలకు కూడా హ్యాండ్ బుక్‌లెట్లను పంపిణీ చేసింది. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తి చేసేందుకు సహకరించాలని సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థులకు రూ.5 లక్షల వరకు ప్రచార పరిమితిని విధించారు. కార్పొరేషన్ల వార్డులకు పోటీచేసే అభ్యర్థులు రూ.1.50 లక్షలు ఖర్చు చేసుకోవాలని సూచించారు. ప్రచార నియమావళిలో భాగంగా అభ్యర్థులు ఎన్నికల ఖర్చు పరిమితి, నిబంధనలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. కరపత్రాలపై ముద్రణాదారుల వివరాలు, పంపిణీదారుల వివరాలన్నీ ఉండాలని, ఆ వివరాలు లేకుంటే ఆ ఖర్చును అభ్యర్థి ఖాతాలో వేస్తామని వెల్లడించారు. బ్యాంకు ఖాతాల నుంచే అభ్యర్థులు ఎన్నికల ప్రచార ఖర్చు చేయాలని, కచ్చితంగా అభ్యర్థితోపాటు ప్రతిపాదించే వ్యక్తితో జాయింట్ ఖాతా తీయాలని సూచించారు. గతంలో ఉన్న ఖాతా కూడా వినియోగించుకోవచ్చని, దీని వివరాలను నామినేషన్లతో జత చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అభ్యర్థి తరఫున ప్రతిపాదిత వ్యక్తి ప్రచార ఖర్చు వివరాలను ప్రతి మూడు రోజులకోసారి వ్యయ పరిశీలకులకు సమర్పించాలని పేర్కొన్నారు. సహకార బ్యాంకుల్లో కూడా ఖాతా తీసుకునే వెసలుబాటును కల్పించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా వ్యయ పరిమితిని ఖరారు చేశారు. ఖర్చు వివరాలను సంబంధిత కార్యాలయాల్లో కేటాయించిన ఫీజు చెల్లించిన వారికి ఇవ్వాలని అధికారులకు సూచించారు.
ముందుగా ‘గ్రేటర్’ ఎలక్షన్స్..
గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. ముందుగా గ్రేటర్ ఎన్నికలను నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి గడువు ముగియనుండగా..వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పాలకవర్గాలు వచ్చే ఏడాది మార్చి 14 నాటికి పదవీకాలం పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా గ్రేటర్ ఎన్నికలు, ఆ తర్వాత రెండు కార్పొరేషన్ల ఎన్నికలను నిర్వహించనున్నారు.
జోనల్ ఆఫీసర్లకు రూ.1,500..
ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులకు గౌరవ వేతనాన్ని ఎస్ఈసీ ఖరారు చేసింది. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు, జిల్లా రిసోర్స్ పర్సన్లకు ఆర్థిక శాఖ జీవో 60 ప్రకారం చెల్లింపులు ఉంటాయని, అదనపు అలవెన్సులు జారీ చేస్తామని, రెగ్యులర్ టీఏ, డీఏకు వారు అర్హులని పేర్కొంది. జోనల్ ఆఫీసర్లు, జోనల్ మెజిస్ట్రేట్‌లకు రూ.1,500లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, కౌంటింగ్ సూపర్‌వైజర్లకు రోజుకు రూ.450, పోలింగ్ ఆఫీసర్, కౌంటింగ్ అసిస్టెంట్లకు రోజుకు రూ.350, మైక్రో అబ్జర్వర్లకు రూ.1,500 చెల్లించనున్నారు. వీడియో సర్వేలైన్స్ బృందాలు, వీడియో షూటింగ్ టీం, అకౌంటింగ్ టీం, వ్యయ పరిశీలకుల బృందం, కాల్ సెంటర్ ఉద్యోగులు, మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటికల్ సర్వేలైన్స్ టీం, ప్రచార ఖర్చు మానిటరింగ్ సెల్ బృందాలు ( ఒక్కొక్కరికి) క్లాస్ -1 ఉద్యోగులకు రూ.1,200, క్లాస్ -3 ఉద్యోగులకు రూ.1,000 చొప్పున ఉండగా, క్లాస్ -4 ఉద్యోగులకు రోజుకు రూ.200 చొప్పున చెల్లించనున్నారు. వెబ్ కాస్టింగ్ వాలంటీర్‌కు రూ.1,000 చొప్పున చెల్లించనున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది.
మిగిలిన వాటికి కూడా..?
రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. పలు కారణాలతో 11 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీకి ఏజెన్సీ రిజర్వేషన్లపై కోర్టులో కేసు ఉంది. దీంతోపాటు మణుగూరు, మంద్రమర్రి మున్సిపాలిటీలను గిరిజనులకు కేటాయించడంతో కోర్టు కేసు ఉంది. వీటి ఎన్నికలు నిర్వహించడం లేదు. కోర్టు కేసులు తేలిన తర్వాతే ఎన్నికలకు వెళ్లనున్నారు. ఇక నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ పదవీ కాలం కూడా వచ్చే ఏడాది మార్చి 14 వరకు, సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్ 15 వరకు గడువు ఉంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చింది. నల్గొండ జిల్లా నకిరేకల్, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీల పాలకవర్గం పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు ఉంది. ఈ రెండు మున్సిపాలిటీలు గ్రామపంచాయతీలుగా ఉన్నప్పుడే పాలకవర్గాలు ఉండటంతో అవి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పదవీకాలం పూర్తవుతున్న జడ్చర్ల, నకిరేకల్‌తోపాటు అచ్చంపేట, సిద్దిపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై ఇంకా సర్కారు నుంచి స్పష్టత రాలేదు. ఈ లెక్కన జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల పాలన వస్తుందని తెలుస్తోంది.