మృతదేహాల రూపంలో వెలుగుచూస్తున్న ‘సెకండ్ వేవ్’

న్యూఢిల్లీ: సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్నది. వైరస్ విశ్వరూపాన్ని కొన్ని ప్రభుత్వాలు కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నప్పటికీ మృతదేహాల రూపంలో అది వెలుగుచూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా వెల్లడిస్తున్న గణాంకాలకు హాస్పిటళ్లలోని వివరాలకు సరిపోలడం లేదు. అధికారిక మరణాలకు, శ్మశానాల్లో ఖననమవుతున్న మృతదేహాల లెక్కలకు పొంతన కుదరడం లేదు. భయాందోళనలు సృష్టించవద్దనో, అతిశయానికి పోవద్దనో, లేదా తీవ్రతను గుట్టుగా ఉంచి ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకోవాలనో.. కారణం ఏదైనా కొన్ని రాష్ట్రాలు కరోనా మరణాలు, కేసుల వివరాలను తొక్కిపెడుతున్నాయి. […]

Update: 2021-04-14 11:10 GMT

న్యూఢిల్లీ: సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్నది. వైరస్ విశ్వరూపాన్ని కొన్ని ప్రభుత్వాలు కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నప్పటికీ మృతదేహాల రూపంలో అది వెలుగుచూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా వెల్లడిస్తున్న గణాంకాలకు హాస్పిటళ్లలోని వివరాలకు సరిపోలడం లేదు. అధికారిక మరణాలకు, శ్మశానాల్లో ఖననమవుతున్న మృతదేహాల లెక్కలకు పొంతన కుదరడం లేదు. భయాందోళనలు సృష్టించవద్దనో, అతిశయానికి పోవద్దనో, లేదా తీవ్రతను గుట్టుగా ఉంచి ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకోవాలనో.. కారణం ఏదైనా కొన్ని రాష్ట్రాలు కరోనా మరణాలు, కేసుల వివరాలను తొక్కిపెడుతున్నాయి. అధికారిక లెక్కలకు, క్షేత్రస్థాయి వివరాలకు మధ్య తారతమ్యాలే ఇందుకు నిదర్శనం. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో ఈ ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. మరెన్నో రాష్ట్రాల్లో ఇంకా బయటపడాల్సి ఉన్నదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

భోపాల్ ట్రాజెడీని మించి.. శవాల రద్దీ

ఈ నెల 8న భోపాల్ శ్మశానవాటికలో 41 శవాలను దహనం చేయగా రాష్ట్ర కరోనా బులిటెన్ లో మాత్రం రాష్ట్రవ్యా్ప్తంగా 27 మంది మరణించారని పేర్కొన్నారు. 9న 35 శవాలకు అంత్యక్రియలు చేయగా.. బులిటెన్ లో 23 మరణాలే ఉన్నాయి. ఇక ఏప్రిల్ 10న 56 మందికి అంత్యక్రియలు నిర్వహించగా.. అధికారిక మరణాలు 24 గానే చూపించారు. తర్వాతి రోజున 68 మందిని కాల్చివేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 24 మందే మరణించారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం అనుమానాలకు తావిస్తున్నది. ఇక 12 వ తారీఖున ఒక్క భోపాల్ లోనే 37 బాడీలను తగులబెట్టగా.. రాష్ట్రం మొత్తమ్మీద 37 మంది చనిపోయారని బులిటెన్‌లో పేర్కొన్నారు. పై గణాంకాలను బట్టి చూస్తే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కరోనా మరణాలను దాస్తున్నదనే విషయం స్పష్టమవుతున్నది. కానీ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ మాత్రం దీనిని ఖండిస్తున్నారు. మరణాల సంఖ్యను దాచడానికి తమకు అవసరం లేదని, అలా చేయడం వల్ల తమకేమీ అవార్డులు రావని ఆయన ఎదురుదాడికి దిగారు. భోపాల్ ట్రాజెడీ సమయంలో చూసినదానికి మించి శవాల రద్దీని చూస్తు్న్నామని, మధ్యాహ్నం లంచ్ చేయడానికీ సమయం దొరకడం లేదని శ్మశానవాటిక సిబ్బంది తెలిపారు.

బులెటిన్‌లో 124 మరణాలు.. శ్మశానంలో 400 మృతదేహాలు

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వమూ కరోనా మరణాలపై దాపరికం పాటిస్తున్నది. రాష్ట్ర రాజధానిలో అధికారిక లెక్కల ప్రకారం, వారంలో 124 మరణాలు చోటుచేసుకున్నాయి. కానీ, నగర శ్మశానాల వివరాల ప్రకారం, కరోనా మృతదేహాల సంఖ్య దాదాపు 400గా ఉన్నాయి. అంటే 276 మరణాలు అధికారిక బులెటిన్ నుంచి మిస్ అయ్యాయి. హాస్పిటళ్లలో చేరిన మరణించినవారు, చీఫ్ మెడికల్ అధికారి నమోదుచేసుకున్నవారి వివరాలను మాత్రమే తాము వెల్లడిస్తు్న్నామని యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ వివరించారు. ఊళ్లలో కరోనా సోకి మరణించి ఉంటే, వారి వివరాలు మెడికల్ అధికారికి చేరితే అవి కరోనా మరణాలుగా అధికారిక రికార్డులో నమోదవుతున్నాయి. సాధారణంగా గ్రామీణంలో మరణాలపై పారదర్శకత చాలా తక్కువగా ఉంటుందన్నది కాదనలేని సత్యం.

పూడ్చి పెట్టే స్థలం కరువు

ఢిల్లీలోని అతిపెద్ద శ్మశాన వాటిక కరోనా మృతదేహాలతో నిండిపోయింది. మరికొన్ని రోజుల్లో శవాలను పూడ్చిపెట్టడానికి స్థలం కూడా దొరికే పరిస్థితి లేదు. ఈ నెల 4 నుంచి మృతదేహాలు పెరుగుతూ వచ్చినా, ఈ సోమవారం, మంగళవారం నుంచి భారీగా మృతదేహాలు వస్తున్నాయని ఢిల్లీ గేట్ సెమెట్రీ కేర్‌టేకర్ తెలిపారు. కేవలం రెండు రోజుల్లోనే 43 బాడీలు వచ్చాయని, ప్రస్తుతం పూడ్చిపెట్టడానికి 150 స్పాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. ఈ శ్మశానంలో కొవిడ్, నాన్ కొవిడ్‌లుగా వేర్వేరు కేటగిరీలను మెయింటెయిన్ చేస్తు్న్నారు. నాలుగు రోజుల్లో ఇక్కడ 240 మరణాలు చోటుచేసుకున్నాయి.

మోడల్ స్టేట్‌లోనూ..

గుజరాత్ మోడల్ స్టేట్‌లోనూ కరోనా మరణాలపై ప్రభుత్వం దాచిపెట్టే ధోరణి అనుసరిస్తు్న్నది. ఉదాహరణకు వడోదర, అహ్మదాబాద్, రాజ్‌కోట్‌లాంటి ప్రధాన నగరాల్లో హాస్పిటళ్లలోని కరోనా మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం వెలువరించి బులెటిన్‌లో లెక్కలు మ్యాచ్ కావడం లేదు. వడోదరలో రాష్ట్ర ప్రభుత్వం మరణాలను సింగిల్ డిజిట్‌కే పరిమితం చేసి ప్రకటిస్తూ వాస్తవంలో అంకెలు వేరుగా ఉన్నాయి. సెకండ్ వేవ్‌ మొదలైన తర్వాత ఇక్కడ కరోనా మరణాలను గరిష్టంగా మూడుగా ప్రకటించింది. కానీ, గుజరాత్‌లోని అతిపెద్ద హాస్పిటల్‌ అయిన వడోదరలోని ఎస్ఎస్‌జీ హాస్పిటల్‌లో వారంలో 142 మరణాలు చోటుచేసుకున్నాయి. జీఎంఈఆర్ఎస్ హాస్పిటల్‌లో 7వ తేదీ నుంచి సుమారు 90 మంది కరోనాతో మరణించారు. అంటే ఒకవారంలో ఈ రెండు హాస్పిటళ్లలోనే 300కుపైగా కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. కానీ, అధికారికంగా ఇక్కడ ఇప్పటి వరకు కేవలం 272 మరణాలు మాత్రమే చోటుచేసుకున్నట్టు వివరించడం ఆందోళనకరం.

Tags:    

Similar News