Kadapa Mlc Elections: మండలి పోరులో పట్టు బిగిస్తున్న Ycp Tdp
శాసనమండలి ఎన్నికల పోరుకు నామినేషన్ల ఘట్టం మొదలైంది. ...
దిశ,కడప: శాసనమండలి ఎన్నికల పోరుకు నామినేషన్ల ఘట్టం మొదలైంది. పట్టభద్రులు, టీచర్ల ఎన్నికలకు నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీ శివరాత్రి, 19వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులు నామినేషన్లు స్వీకరించబడవు. 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 27 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. మార్చి 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈ మేరకు జిల్లాలో ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. అంతేకాదు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అభ్యర్థులు గాని, రాజకీయ పార్టీలు గానీ నిబంధన పాటించాలని సూచిస్తూ నియమాలపై గట్టి నిఘా ఉంచింది. ఓవైపు అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉండగా మరోవైపు రాజకీయ నాయకులు, అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
పట్టభద్రులు, టీచర్ల అభ్యర్థులకు మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిలబడ్డ రాంగోపాల్ రెడ్డికి తెలుగుదేశం, వెన్నపూస రవీంద్రారెడ్డికి వైసీపీ మద్దతు ఇస్తున్నాయి. టీచర్ల స్థానం నుంచి పోటీ చేస్తున్న రామచంద్రారెడ్డికి వైసీపీ మద్దతు ఇస్తుండగా తెలుగుదేశం పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు. అయితే అధికార వైసీపీ మాత్రం తాము మద్దతిస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవాలన్న వ్యూహంతో ఉంది . ఈ మేరకు పార్టీ నేతలు, శ్రేణులను అప్రమత్తం చేసింది. వారికి బాధ్యతలు కూడా అప్పగించింది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా పట్టభద్రుల స్థానం నుంచి తాము మద్దతునిస్తున్న అభ్యర్థిని గెలిపించుకునేందుకు పక్కా వ్యూహంతోనే ఉంది. రాబోయే సాధారణ ఎన్నికల ముందు జరగనున్న ఈ మండలి పోరు రాజకీయ పార్టీలకు సెమీఫైనల్స్‌గా మారడంతో పశ్చిమ రాయలసీమలో ఆసక్తి రేగుతోంది.