Kadapa: మహిళా ఓటర్లదే పైచేయి.. పురుషుల కంటే అధికం

ఓటర్ల జాబితాలో వైఎస్ఆర్ జిల్లాలో పురుషుల కంటే మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు....

Update: 2023-10-27 13:16 GMT

దిశ, కడప: ఓటర్ల జాబితాలో వైఎస్ఆర్ జిల్లాలో పురుషుల కంటే మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఒక బద్వేల్ మినహా అన్ని చోట్ల ఓటర్ల జాబితాలో వారిదేపై చేయిగా ఉంది .జిల్లా ఓటర్లు జాబితాలో 28,797 వేల మంది ఓటర్లు అధికంగా ఉన్నారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల వివరాలను ముసాయిదా జాబితాను జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ ప్రకటించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15,96,923 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 246 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు.

ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణలో -2024లో కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు,ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు. ఓటరు జాబిత ప్రత్యేక సంక్షిప్త సవరణ -2024కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

బద్వేలు (ఎస్.సి) అసెంబ్లీ నియోజకవర్గంలో పురుషులు 1,08,489, స్త్రీలు 1,07917, ట్రాన్స్ జెండర్స్ 11 మంది ఉండగా, మొత్తం ఓటర్లు 2,16,417 మంది ఉన్నారు. కడపలో పురుషులు 1,29,821 , స్త్రీలు 1,35,746 , ట్రాన్స్ జెండర్స్ 92 మంది ఉండగా మొత్తం ఓటర్లు 2,65,659 మంది ఉన్నారు. పులివెందులలో పురుషులు 1,08,740, స్త్రీలు 1,13,853, ట్రాన్స్ జెండర్స్ 21 మంది కలిసి 2,22,614 మంది ఓటర్లు ఉన్నారు.

కమలాపురం నియోజకవర్గంలో పురుషులు 97,095, స్త్రీలు 1,00,447, ట్రాన్స్ జెండర్స్ 37 మందితో కలసి 1,97,579 మంది ఉన్నారు. అలాగే జమ్మలమడుగు నియోజకవర్గంలో పురుషులు 1,18,989, స్ర్తీలు 1,25,114 , ట్రాన్స్ జెండర్స్ 23 మంది ఓటర్లు వుండగా మొత్తం ఓటర్లు 2,44,126 మంది ఉన్నారు. ప్రొద్దుటూరులో పురుషులు 1,19,347, స్త్రీలు 1,25,197, ట్రాన్స్ జెండర్స్ 51 మంది కలిపి మొత్తం ఓటర్లు 2,44,595 మంది ఉన్నారు. మైదుకూరు నియోజకవర్గంలో పురుషులు 1,01,459, స్త్రీలు 1,04,463, ట్రాన్స్ జెండర్స్ 11 మందితో కలిపి మొత్తం ఓటర్లు 2,05,933 మంది ఉన్నారు.

అన్ని మండల కార్యాలయాల్లో జాబితా ..

జిల్లాలోని ఓటర్లందరూ ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ -2024 ప్రకియలో భాగంగా శుక్రవారం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల తహశీల్దార్ కార్యాలయాలలో ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ తెలిపారు. ఈ ముసాయిదా ఓటరు జాబితా తనిఖీ నిమిత్తం ఓటరు నమోదు అధికారి, సహాయ ఓటరు నమోదు అధికారి, పోలింగ్ బూత్‌ల వద్ద పని వేళల్లో తనిఖీ చేసుకొనేందుకు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా ప్రజలందరూ విధిగా తమ ఓటర్ల వివరాలను ముసాయిదా జాబితాలో తనిఖీ చేసుకొని, ఏవైనా దావాలు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27వ తేదీ నుండి 09.12.2023 తేదీలోపు అధికారులకు తెలియజేయాలన్నారు. లేదా ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు.


Similar News