Pawan Kalyan : జగన్ ఇలాకపై పవన్ ఫోకస్.. ఆ మూడు స్థానాలు కోరే ఛాన్స్
టీడీపీ, జనసేనల మధ్య పొత్తు పొడవడంతో కడప జిల్లాలో రాజకీయ చర్చలు వేడెక్కాయి....
దిశ, కడప ప్రతినిధి: టీడీపీ, జనసేనల మధ్య పొత్తు పొడవడంతో కడప జిల్లాలో రాజకీయ చర్చలు వేడెక్కాయి. నేరుగా జనసేనాని పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పొత్తు ప్రకటన చేయడంతో రాష్ట్ర రాజకీయాలతోపాటు జిల్లా రాజకీయాల్లో ఈ పొత్తు హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి కడప జిల్లాలో జనసేన, టీడీపీ మధ్య సర్దుబాట్లు ఎలా ఉంటాయి?, టీడీపీ, జనసేనకు ఎక్కడ సీట్లు కేటాయిస్తుంది? ఉమ్మడి కడపలో వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ఒక్కొక్క సీటు కేటాయిస్తుందా? ఉమ్మడి జిల్లాకు కలిపి ఒకే సీటు కేటాయిస్తుందా? కేటాయించే అసెంబ్లీ నియోజకవర్గాల ఏవై ఉంటాయి? అనే దానిపై జిల్లాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
ఆ రెండింటిపైనే..
జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తు కుదిరితే జిల్లాలోని బద్వేలు , రాజంపేట అసెంబ్లీ సీట్లు అడిగే యోచనలో జనసేన ఉన్నట్లు గత కొంతకాలంగా అభిప్రాయ పడుతున్నారు. వీటితోపాటు తెలుగుదేశం పార్టీలో ఏర్పడే రాజకీయ పరిస్థితులను బట్టి మైదుకూరు టికెట్‌పైనా దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పొత్తు ఖరారు కావడంతో జనసేన ఈ మూడు చోట్ల ఎక్కడ సీటు దక్కించు కుంటుందన్న దానిపై ఇరు పార్టీల్లోనూ ఆసక్తి రేపుతోంది. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం పవన్ కళ్యాణ్‌కు సామాజిక పరంగా మంచి బలం ఉన్న నియోజకవర్గం. ఇక్కడ నుంచి జనసేన పోటీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన అధికారి వై శ్రీనివాస్ రాజు సంసిద్ధంగా ఉన్నారు. రాజకీయాలతో సంబంధం ఉన్న ఈ కుటుంబం నుంచి ఆయన తమ్ముడు శివరామరాజు గతంలో జెడ్పీటీసీ నందలూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈయన తనకు పొత్తులో రాజంపేట టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఇదే నియోజకవర్గానికి సంబంధించిన ఆ పార్టీ యువ నాయకుడు అతికారి దినేష్ జనసేన టికెట్ బరిలో ఉన్నట్లు సమాచారం. ఈయన గతంలో సిద్దవటంలో జనసేనాని సభ పెద్ద ఎత్తున జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. రాజంపేట నియోజకవర్గంలో చాలా చురుగ్గా ఉంటున్నారు.
ఇరు పార్టీల హర్షం
బద్వేలు రిజర్వ్‌డ్ అసెంబ్లీ స్థానం టికెట్‌ను జనసేన అడిగే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి గతంలో ఒకసారి అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన విజయజ్యోతి టిక్కెట్ కేటాయిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. ఇక మైదుకూరు టీడీపీ టికెట్ ఆ పార్టీ ఇన్చార్జి సుధాకర్ యాదవ్‌కి కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో రాజంపేట, బద్వేలుపై దృష్టి సారించిన జనసేన మైదుకూరుపైనా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పొత్తు కుదరడంతో జనసేన, తెలుగుదేశం పార్టీలో హర్షం వ్యక్తమవుతోంది. రెండు పార్టీలు కూడా ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సీట్ల సర్దుబాటు కీలకంగా మారింది.