AP:జిల్లాలో గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం
జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలపై కొరడా ఝుళిపించేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికతో పోలీస్ శాఖ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు.
దిశ, కడప:జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలపై కొరడా ఝుళిపించేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికతో పోలీస్ శాఖ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. ప్రణాళిక లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీసు బృందాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో గంజాయి కేసుల్లో ఉన్నవారిని మళ్ళీ నేరాలకు పాల్పడకుండా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. పదే పదే గంజాయి నేరాలకు పాల్పడే వారి పై హిస్టరీ షీట్లు తెరవడంతో పాటు పీడీ యాక్ట్ ప్రయోగించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
విస్తృతంగా నాకాబందీ నిర్వహించి అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల ద్వారా కలిగే అనర్ధాలపై కళాశాలలు, విద్యాసంస్థల్లో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు గంజాయికి సంబంధించిన సమాచారాన్ని 14500 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు. గంజాయి నిర్మూలనకు ప్రజలు తమ వంతు సామాజిక బాధ్యతగా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. గంజాయి సేవించే వ్యసనానికి బానిసగా మారిన వారి సమాచారమిస్తే వారిని రిమ్స్ ప్రభుత్వ సమగ్ర వైద్యశాల లోని డీ అడిక్షన్ కేంద్రానికి తరలించి తిరిగి వారిని సమాజంలో సాధారణ వ్యక్తిలా మార్చేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.