Chandrababu Naidu arrest: కడపలో టీడీపీ నేతల బంద్.. పలువురు అరెస్ట్
మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసి ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు....
దిశ, కడప: మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసి ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. ర్యాలీలు, రస్తారోకోలు చేస్తున్న నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం తోపులాట జరిగాయి. ఆర్టీసీ బస్సులు, విద్యా సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలు యధావిధిగా పని చేశాయి. జన జీవనానికి ఎలాంటి ఆటంకాలు కలగలేదు. బంద్ సందర్భంగా పోలీసు యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.
కడపలో నిరసన వ్యక్తం చేస్తున్న కడప నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఆర్ మాధవిరెడ్డి, పార్టీ నాయకులు జిలానీ బాషా, ఎం.పి సురేష్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగే ఏడు రోడ్ల కూడలి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు ఎస్ గోవర్థన్ రెడ్డి, బి హరిప్రసాద్ లను డి.ఎస్పీ షరీఫ్, వన్ టౌన్ సి.ఐ నాగరాజు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రొద్దుటూరులో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే ఎన్ వరదరాజులురెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగి సొమ్మసిల్లి పోవడంతో చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సి.ఎం సురేష్ బాబు, మాజీ మునిసిపల్ ఇన్ ఛార్జ్ చైర్మెన్ వి.ఎస్ ముక్తియార్‌లు పట్టణంలో బంద్‌ను పర్యవేక్షిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మైదుకూరు, రాజంపేటల్లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రోడ్డుపై బైటాయించిన పుట్టా సుధాకర్ యాదవ్, మేడా విజయ భాస్కర్ రెడ్డి లను పోలీసులు అడ్డుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సి భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. రాయచోటిలో టీడీపీ నాయకులు ఆర్ రమేష్ కుమార్ రెడ్డి, సుగవాసి ప్రసాద్‌లను హౌస్ అరెస్టు చేశారు. అలాగే కమలాపురంలో పార్టీ రాష్ర్ట ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డిని అరెస్టు చేశారు.