జగన్ రాయలసీమ ద్రోహి.. చంద్రబాబు నాయుడు

కడపలో జరిగిన ఓ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించారు.

Update: 2023-04-18 15:24 GMT

దిశ, ప్రతినిధి, కడప: ‘‘రాష్ట్రంలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాం. 108 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. వైసీపీలో భూకంపం మొదలైంది. ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచాం. వై నాట్ పులివెందుల.. వై నాట్175. పైశాచిక ఆనందం పొందే జగన్మోహన్ రెడ్డికి ఇదే ఆఖరి అవకాశం. వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం ప్రభుత్వం మనదే’’ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమాయత్త జోన్ సమావేశాలలో భాగంగా జోన 5 సమావేశం మంగళవారం కడపలో నిర్వహించారు .ఈ సమావేశానికి ఉమ్మడి కడప, కర్నూలు , అనంతరం జిల్లా నుంచి అసెంబ్లీ, మండలి క్లస్టర్ కమిటీల వరకు అధ్యక్షులు, కార్యదర్శులు , బాధ్యులు వచ్చారు.

మధ్యాహ్నం రెండు గంటలకు కడప చేరుకున్న ఆయన ఆరు గంటల వరకు కార్యకర్తలు సమావేశంలో పార్టీ పనితీరు, పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు , ఇదేం కర్మ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాల్లో చురుకుగా పని చేసిన వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీలో భూకంపం మొదలైందని, వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని, ఇందుకోసం ‘మీ మెకానిజం మీ పనితనం’ ప్రధానమని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కష్టపడే వారికి పదవుల పంపకంలో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. గత నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో మన వారిని ఇబ్బంది పెట్టి ఉంటే దానికి బదులు తీసుకుంటామని, ధైర్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. దాడులకు భయపడే పార్టీ తెలుగుదేశం కాదని , ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు.

ఓటు బటన్ మనకే

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పధకాల పేరుతో బటన్ నొక్కినా, నొక్కకపోయినా ప్రజలు ఓటు బటన్ మాత్రం మనకే నొక్కుతారని చంద్రబాబు అన్నారు. జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ఏ వర్గం సంతృప్తిగా లేదని, భూకబ్జాలు, రౌడీయిజం, ధరల పెరుగుదల, ప్రశ్శిస్తే కేసులు పెట్టడం , గంజాయి, గన్ కల్చర్ పెరగడం, జీవన ప్రమాణాలు తగ్గిపోవడం లాంటి రకరకాల సమస్యలతో ప్రజలు విసిగి పోయారని విమర్శించారు. ఇలా సమస్యల్లో ఉన్న వారికి మనం ఇప్పుడు పరిష్కారం చూపించలేకపోయినా, వారి పక్షాన నిలబడి సంఘీభావం తెలిపి ప్రభుత్వం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామంటూ వారికి భరోసా ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రజలు తెలుగుదేశంకు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని, వారి సమస్యలను గుర్తించి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని సూచించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ , వంట గ్యాస్ ధరలు పెరిగాయన్నారు. అభివృద్ధి చూద్దామంటే కనిపించలేదని పేర్కొన్నారు . వీటన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో గతంలో జరిగిన 2009, 2014, 2024 ఎన్నికల్లో లభించిన ఓట్లు , పోలింగ్ తీరు , వాటి వివరాలు ఆధారంగా చేసుకొని ఎన్నికల్లో పార్టీ ముందుకు వెళ్తుందని తెలిపారు.

రూ.2 లక్షల కోట్ల అవినీతి

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయనతోపాటు ఆయన పార్టీ , నాయకులు ఎమ్మెల్యేలు మరో రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు ప్రజలపై ఐదు లక్షల కోట్ల రూపాయల పన్నులు వేశారని పేర్కొన్నారు. రూ.10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని తెలిపారు. జగన్ పాలనలో నేరాలు, ఘోరాలు పెరిగిపోయారని విమర్శించారు.

వివేకా హత్య ప్రపంచానికి కేస్ స్టడీ

వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రపంచానికే కేస్‌ స్టడీ లాంటిదని చంద్రబాబు పేర్కొన్నారు. వివేకా హత్యపై వైసీపీ నాయకుల మాటలు వింటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని అన్నారు. ఆయన ఒక మాజీ సీఎంకు తమ్ముడు మాజీ మంత్రి ,మాజీ ఎంపీ , ప్రస్తుత సీఎంకు చిన్నాన్న అయినప్పటికీ ఆయన కేసు ఇలాగే నడుస్తూ పోతుంది అంటే ఇది ప్రపంచానికే కేస్ స్టడీ అని అన్నారు. 2019 మార్చి 15న హత్య జరిగిందని, మొదట్లో గుండెపోటు అని, ఆ తర్వాత రక్తపు వాంతులు అని మాట్లాడారన్నారు.

ఆయన బాడీని బాక్సులో పెట్టి దహన క్రియలు చేసేందుకు ప్రయత్నిస్తే ఆయన కూతురు పోస్టుమార్టం చేయాలని కోరిందని చేశారు. ఈ కేస్ కోసం మెజిస్ట్రేట్ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుల వరకు తిరుగుతున్నారని విమర్శించారు. అప్పట్లో వివేకా హత్యపై నారా సుర రక్త చరిత్ర అని నింద నా మీద మోపాలని చూశారన్నారు. గత ఎన్నికలప్పుడు నాన్న లేడు, చిన్నాన్న లేడు అని మాట్లాడుతూ సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారన్నారు. ఆ తరువాత కోర్టులో సీబీఐ పిటిషన్ ఉప సంహరించుకున్నారన్నారు. కానీ ఆయన కూతురు మాత్రం ముందుకే వెళ్లిందని, తండ్రిని చంపిన వారిని ప్రపంచానికి తెలపాలని ఆమె పోరాటం చేస్తుంటే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఆమె తండ్రి హత్యను ఖండించాలని అన్నారు. ఈ కేసు పోలీసులకు, న్యాయవాదులకు, మర్డర్ లు చేసే వారికి కేస్ స్టడీ అన్నారు. వివేక హత్య కేసులో నిజాలు బయటకు వస్తాయని దోషులకు శిక్ష పడడం ఖాయమని పేర్కొన్నారు.

రౌడీల తోక కత్తిరిస్తా

‘‘కడపకు వస్తుంటే ఎవరో నన్ను అడ్డుకోవాలని చూశారంట. ఇలాంటి రౌడీల తోకలు కత్తిరిస్తాను’’ అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ‘‘రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా చేశాను. తీవ్రవాదం లేకుండా చేశాను, మత సామరస్యాన్ని కాపాడాను. ఇలాంటి తనను అడ్డుకుంటారా’’ అని ప్రశ్నించారు.. రాయలసీమలో అభివృద్ధి , నీటి ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం పని చేసే చాలా మటుకు సాధించానని, ఇప్పుడు ఒక్క పరిశ్రమ తీసుకు రాకుండా, ప్రాజెక్టులు కట్టకుండా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహిగా మారారని విమర్శించారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడుతో పాటు సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లాకు చెందిన నాయకులు శ్రీనివాస్ రెడ్డి , నరసింహారెడ్డి , సుధాకర్ యాదవ్ , ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి , తదితర నేతలు మూడు జిల్లాల నుండి హాజరయ్యారు.

Tags:    

Similar News