మొద్దు శ్రీనులాగా నా భర్తను చంపేస్తారేమో: దస్తగిరి భార్య షబానా
మాజీమంత్రి వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన తన భర్త షేక్ దస్తగిరికి జైల్లో ప్రాణహాని ఉందని ఆయన భార్య షేక్ షబానా ఆందోళన వ్యక్తం చేశారు.,,
దిశ, కడప: మాజీమంత్రి వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన తన భర్త షేక్ దస్తగిరికి జైల్లో ప్రాణహాని ఉందని ఆయన భార్య షేక్ షబానా ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రగుంట్ల పోలీసులు షేక్ దస్తగిరిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన భర్త దస్తగిరికి జైల్లో ప్రాణహానీ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో జైలులో మొద్దు శీనును ఎలా హతమార్చారో అదే తరహాలో తన భర్తను కూడా హత్య చేస్తారనే అనుమానంగా కలుగుతుందన్నారు.
తన భర్త వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారినప్పటి నుంచి ఎం.పి వై.ఎస్ అవినాష్‌రెడ్డి పగ పెంచుకున్నారని చెప్పారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ ఎం సుధీర్ రెడ్డి కుట్రపూరితంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరికించారన్నారు. తన భర్తను ఏదో ఒక కేసులో అక్రమంగా ఇరికించి జైల్లో హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. తన భర్త ఇటీవల కాలంలో ఏ పంచాయితీలకు వెళ్లడం లేదని, ఒక వేళ ఆయన వెళ్తే కచ్చితంగా కేసు నమోదు చేస్తారనే నేపథ్యంలో ఆయన అలాంటి వాటికి దూరంగా ఉంటున్నారన్నారు. అయితే తమ సమీప బంధువు అమ్మాయి విషయమై మాట్లాడేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లిన దస్తగిరిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అక్రమంగా జైలుకు తరలించారని ఆరోపించారు. ఇప్పటికే దస్తగిరి పై శ్రీకాళహస్తి, వేముల, తొండూరు తదిత ప్రాంతాల్లో చాలాకేసులు పెట్టారన్నారు. కానీ తన భర్తను జైల్లో ఎక్కడ హతమారుస్తారోనని భయంగా ఉందన్నారు. తన భర్తకు ఏం జరిగినా ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారణ మవుతారన్నారు. తన భర్తను వెంటనే విడుదల చేయాలని దస్తగిరి భార్య షబానా కోరారు.