రాజంపేట సీను మారుతోందా..? సైకిలా!కమలమా!
తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల పొత్తు జిల్లాలో ఆ మూడు పార్టీల శ్రేణుల్లో అయోమయంగా మారింది. రాజంపేట పార్లమెంట్ అసెంబ్లీ సీటు ఎవరికి అన్నది సందిగ్ధంలో పడింది.
దిశ ప్రతినిధి కడప: తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల పొత్తు జిల్లాలో ఆ మూడు పార్టీల శ్రేణుల్లో అయోమయంగా మారింది. రాజంపేట పార్లమెంట్ అసెంబ్లీ సీటు ఎవరికి అన్నది సందిగ్ధంలో పడింది. ఇప్పటిదాకా రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద తనయుడు సుబ్రహ్మణ్యం పోటీ చేస్తారని చర్చ జరిగింది. ఇందుకు తోడు పార్టీ అధిష్టానం కూడా ఆయనకు స్పష్టత ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే జనసేన తో పాటు తాజాగా బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకోవడం తో అక్కడ సీన్ మారబోతోందన్న వార్తలు వస్తున్నాయి.అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు ఇస్తారని ఆ పార్టీలో ధీమా ఉంది. జిల్లాలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. అయితే జనసేన టీడీపీ తో కుదుర్చుకున్న సీట్లలో దీన్ని ఇంతవరకు ప్రకటించకపోవడం, ఇందుకు తోడు ఇక్కడ టీడీపీ నేతలు ఈ సీటు కోసం గట్టిగా పట్టు పట్టుతుండడంతో ఈ సీటుపై పీఠముడి తప్పదా అన్న సందిగ్ధం నెలకొంది.
బీజేపీ, టీడీపీ పొత్తుల నేపథ్యంలో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పొత్తు ఖరారైన తరుణంలో ఉమ్మడి కడప జిల్లా నుంచి రాజంపేట పార్లమెంట్ సీటు బీజేపీ కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఆ సీటు అధికారికంగా ఖరారు అయితే సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దించాలన్న యోచనతో బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటివరకు పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు అనుకున్న సుగవాసి సుబ్రహ్మణ్యం పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారబోతోంది .అయితే ఒకవేళ బీజేపీకి ఇక్కడి నుంచి సీటు ఖరారు చేస్తే బాలసుబ్రమణ్యం కు రాజంపేట అసెంబ్లీ ఇస్తారన్న ప్రచారం కూడా కొంత సాగుతోంది .
అయితే ఇప్పటికే అసెంబ్లీ టికెట్ కోసం ఆ నియోజకవర్గ ఇన్చార్జి బత్యాలు చెంగల రాయుడు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, తో పాటు గతంలో పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన నరహరిలు ప్రయత్నాల్లో ఉన్నారు.వీరి తో పాటు జనసేన ఆ పార్టీ నుంచి శ్రీనివాసరాజు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నారు. ఈయనతో పాటు జనసేన నుంచి దినేష్ టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు .రాజంపేట అసెంబ్లీ పై జనసేనతో, పార్లమెంటుపై కమలంతో టీడీపీ సందిగ్ధ పరిస్తితుల్లో టికెట్ పై స్పష్టత కోసం అధిష్టానం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది .
ఈ పరిణామాల్లో ఎవరికి పార్లమెంట్, ఎవరికి అసెంబ్లీ దక్కుతుందని ఉత్కంఠ గా మారింది.అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ, బీజేపీ,జనసేన పొత్తులో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బరిలో ఉంటారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఆయన గత ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించే ఆలోచనతో అనకాపల్లి నుంచి పోటీ చేయించవచ్చన్న ప్రచారం సాగుతోంది.