Breaking News: రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి మార్పు..బరిలో అరవ శ్రీధర్
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిని మార్చారు..
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిని మార్చారు. తొలుత యనమల భాస్కర్ రావును పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా యనమల భాస్కర్‌రావుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో రైల్వే కోడూరులో జనసేన కింద స్థాయి కేడర్, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. యనమల భాస్కర్ రావు అభ్యర్థిత్వాన్ని మార్చాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో పునరాలోచనలో పడిన పవన్ రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్ర స్థాయి నివేదికలు, జిల్లా నేతల అభిప్రాయాలతో అరవ శ్రీధర్ పేరును ఖరారు చేశారు. యనమల భాస్కర్ రావు స్థానంలో అరవ శ్రీధర్‌ను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్ బరిలోకి దిగనున్నారు.
దీంతో నియోజకవర్గంలో బయటపడ్డ విభేదాలు సద్దుమనిగాయి. తొలుత యనమల భాస్కర్ రావుకు సీటు ఇవ్వడంపై వీరంతా గుర్రుగా ఉన్నారు. యనమల భాస్కర్ రావు మంత్రి పెద్దిరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తికి సీటు ఇవ్వడంపై పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. దీంతో పునరాలోచనలు చేసిన జనసేన అధిష్టానం చివరకు అరవ శ్రీధర్‌ను ఫైనల్ చేసింది. ఈ మేరకు అరవ శ్రీధర్ అభ్యర్థిత్వాన్ని గురువారం వెల్లడించింది.