హత్యాయత్నం కేసు.. ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జి సహా ముగ్గురిపై కేసు
వైసీపీ కార్యకర్త బెనర్జీపై హత్యాయత్నం కేసులో వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్‌ఛార్జ్ డి.ఎస్పీ నాగరాజు తెలిపారు...
దిశ, వెబ్ డెస్క్: వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ కార్యకర్త బెనర్జీపై హత్యాయత్నం కేసులో ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జ్ డి.ఎస్పీ నాగరాజు తెలిపారు. ప్రొద్దుటూరు త్రీ టౌన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డి.ఎస్పీ మాట్లాడుతూ బెనర్జీ, తెలుగు యువత నాయకుడు భరత్ కుమార్ రెడ్డిల మధ్య పాత కక్షలున్నాయన్నారు. ఈ క్రమంలో శుక్రవారం వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికారిత బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొంటున్న బెనర్జీపై మెడినోవా సెంటర్‌లో కొబ్బరి కాయాలు విక్రయిస్తున్న వారి నుంచి కత్తి తీసుకొని భరత్ కుమార్ రెడ్డి దాడి చేశారన్నారు. ఈ దాడిలో బెనర్జీ తలకు, చేతికి తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారన్నారు. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి అయిన వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి భరత్ కుమార్ రెడ్డి, రాము అలియాస్ రామ్మోహన్ రెడ్డి, ఈ కుట్రలో భాగస్వాములైన ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జి ప్రవీణ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బెనర్జీని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.