Kadapa: అఖిలపక్షం నేతల ఆందోళన.. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్

రాష్ట్రంలో ఓ వైపు కరువు, మిచౌంగ్ తుఫానుతో మరోవైపు ప్రజలు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉంటే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేదని అఖిలపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ...

Update: 2023-12-14 15:50 GMT

దిశ, కడప: రాష్ట్రంలో ఓ వైపు కరువు, మరోవైపు మిచౌంగ్ తుఫానుతో ప్రజలు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉంటే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేదని అఖిలపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కరువు, తుఫాను సహాయక చర్యలు చేపట్టాలని కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. కడప జిల్లాను కరువు జాబితాలో చేర్చకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధుల ఇళ్లనుa ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో వర్షపాతం నమోదు కాలేదని, వర్షాలు వస్తాయన్న నమ్మకంతో రైతులు దుక్కి దున్ని, ఎరువులు, విత్తనాలు విత్తితే మొలకెత్తకుండానే బుగ్గిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొరగా వేసిన పంటలు కూడా తెగుళ్లు, వర్షాభావంతో పూర్తిగా ఎండిపోయాయని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన 103 కరువు మండలాల జాబితాలో కడపలోని ఒక్క మండలాన్నిచేర్చకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అఖిలపక్షం నేతలు మండిపడ్డారు.

ఎన్నికల ముందు నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన ప్రతి గ్రామానికి తాగు, సాగు నీరు అందిస్తామని జగన్ మోహన్ రెడ్డి చెప్పారని అఖిలపక్షం నేతలు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటినా గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగా, వెలుగొండ, రాజోలి ప్రాజెక్టులు, పంట కాలువలు పూర్తికి అవసరమైన నిధుల కేటాయింపులో తీవ్రమైన నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల రాయలసీమ మరోమారు కరువాతన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించి కరువు, తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగం వివరాలు సేకరించి, ప్రస్తుత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నష్టపరిహారాన్ని, పంటల బీమా పరిహారాన్ని చెల్లించాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు.


Similar News