వైసీపీ చేసే ప్రతి తప్పును చంద్రబాబు పై నెట్టేస్తున్నారు:నారా భువనేశ్వరి

రాష్ట్రంలో వైసీపీ చేసే ప్రతి తప్పును చంద్రబాబు పై నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారని నేడు కొత్తగా పెన్షన్ల విషయాన్ని కుట్ర పూరితంగా చంద్రబాబు పై అపాదిస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా భువనేశ్వరి విమర్శించారు.

Update: 2024-04-04 14:59 GMT

దిశ,కడప:రాష్ట్రంలో వైసీపీ చేసే ప్రతి తప్పును చంద్రబాబు పై నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారని నేడు కొత్తగా పెన్షన్ల విషయాన్ని కుట్ర పూరితంగా చంద్రబాబు పై అపాదిస్తున్నారని  నారా భువనేశ్వరి విమర్శించారు. వృద్దులను మంచాలపై ఎండలో తీసుకెళ్లి వాళ్ల ప్రాణాలు వైసీపీ నాయకులు, కార్యకర్తలు బలి తీసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం తపించే చంద్రబాబు పేద వాళ్లకు పెన్షన్లను ఎలా అడ్డుకుంటారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గురువారం చంద్రబాబు అక్రమ అరెస్ట్ సమయంలో మనస్థాపానికి గురై మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు కడప, ప్రొద్దూటూరులో పర్యటించారు.

కడప నగరంలోని 44 వ వార్డులో పార్టీ కార్యకర్త చెండ్రాయుడు,ప్రొద్దుటూరులోని రాధ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాత్రింబవళ్లు ఎలా కష్టపడ్డారో మీకు బాగా తెలుసు. మరో ఐదేళ్లు చంద్రబాబు సీఎం గా వుండి వుంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేదన్నారు.వైసీపీ రాక్షస పాలనలో టీడీపీ కార్యకర్తలను చంపడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారిందన్నారు. రాక్షస పాలన లో నేను ధైర్యంగా ఇలా మీ వద్దకు వచ్చానంటే మీరున్నారనే నమ్మకమేనన్నారు. గంజాయి, ఇసుక మాఫియా, భూకబ్జాలు, కల్తీ మద్యంలో వైసీపీ ప్రభుత్వం ఏపీని దేశంలో ముందు వరుసలో నిలబెట్టిందన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు.పైగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పక్కన ఉన్న రాష్ట్రాలకు వెళ్లి పోయాయన్నారు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ కార్యకర్తలు సై అంటే సై అనేలా ముందుకొచ్చి నిజాన్ని గెలిపించాలని,టీడీపీ జెండాను ఎగరవేయడానికి కృషి చేయాలన్నారు.నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య వంటి అనేక మంది కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టారన్నారు.టీడీపీని ముందుకు నడిపించేది లక్షలాది కార్యకర్తలే అన్నారు.టీడీపీ కార్యకర్తలు సైకిల్ స్పీడ్ పెంచాలని, అడ్డొచ్చిన దుర్మార్గులను తొక్కుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, కడప అసెంబ్లీ పార్టీ అభ్యర్థి ఆర్ మాధవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News